triple talak: ట్రిపుల్ తలాక్ ను నేరంగా పరిగణిస్తూ ఆర్డినెన్స్ జారీకి కేంద్రం యోచన!

  • రాజ్యసభలో గట్టెక్కని బిల్లు
  • సంయుక్త పార్లమెంటు సమావేశం నిర్వహించే అంశం పరిశీలన
  • నేరంగా పరిగణించడాన్ని వ్యతిరేకిస్తున్న కొన్ని పార్టీలు, వర్గాలు

ముస్లిం మహిళల హక్కులను కాలరాస్తున్న ట్రిపుల్ తలాక్ (మూడు సార్లు తలాక్ చెప్పగానే విడాకులు జారీ అయినట్టు) ఆచారాన్ని నేరంగా పరిగణిస్తూ కేంద్రం ఓ ఆర్డినెన్స్ జారీకి ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపినప్పటికీ, రాజ్యసభలో మెజారిటీ లేకపోవడంతో మోదీ సర్కారు ప్రతిపక్షాల డిమాండ్ మేరకు ఆ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపేందుకు అంగీకరించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో, ఆర్డినెన్స్ ను తీసుకురావడమో.. లేదా బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని నిర్వహించడం ద్వారానో బిల్లును ఆమోదింపజేసుకోవడం అనే ఆప్షన్లను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ట్రిపుల్ తలాక్ బిల్లుపై ప్రతిపక్షాలతోపాటు ఎన్డీయేలో భాగమైన టీడీపీకి సైతం కొన్ని అభ్యంతరాలున్నాయి. ముస్లింలలోనే కొందరు మహిళా గ్రూపులు, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సైతం ట్రిపుల్ తలాక్ ను నేరంగా పరిగణించడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ట్రిపుల్ తలాక్ ను చెల్లుబాటు కాదనే వరకే పరిమితం చేయాలన్న డిమాండ్ ఉంది.

More Telugu News