Telangana: కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్బుతం .. ఈ తరహా ప్రాజెక్టును ఎక్కడా చూడలేదు : సీడబ్ల్యూసీ సంతృప్తి
- ఇది సమీకృత, బహుళార్ధసాధక ప్రాజెక్టు
- వచ్చే వానాకాలం నాటికి తొలి మైలురాయి దాటనున్న ప్రాజెక్టు
- కేంద్ర జలసంఘం ప్రతినిధులు
కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతమని, ఈ తరహా ప్రాజెక్టును ఎక్కడా చూడలేదని కేంద్ర జల సంఘం ప్రతినిధుల బృందం (సీడబ్ల్యూసీ) సంతృప్తి వ్యక్తం చేసింది. రెండు రోజులపాటు కాళేశ్వరం పనులను పరిశీలించిన ఈ బృందం సభ్యులు ఈరోజు ‘జలసౌధ’లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు దేశ చరిత్రలోనే విభిన్నమైందని, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణ రంగంలో జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాల రీత్యా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు అన్నివిధాలా ప్రత్యేకమైందని అన్నారు. ఇది సమీకృత, బహుళార్థసాధక ప్రాజెక్టు అని, మిడ్ మానేరు, ఎస్.ఆర్.ఎస్.పి సహా పలు ప్రాజెక్టులకు కాళేశ్వరం ఆధారం కాబోతోందని కేంద్ర జల సంఘం ప్రాజెక్టుల అప్రైజల్ విభాగం చీఫ్ ఇంజనీర్ సి.కె.ఎల్.దాస్ అన్నారు.
వచ్చే వానాకాలం నాటికల్లా కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి మైలు రాయి దాటుతుందని సీడబ్ల్యూసీ బృంద సారధి దాస్ అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, 18 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం తో పాటు మరో 18 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీటిని అందించే బృహత్తర ప్రాజెక్టు ఇది అని ప్రశంసించారు. జూన్ లో ప్రాజెక్టు ద్వారా తొలి ఫలితాన్ని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, నిర్ణీత సమయంలో పనులు జరిగితే అనుకున్న గడువులోపే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ వ్యయం పెరగకుండా పనులు పూర్తి కావాలని, అందుకు ప్రతి ఒక్కరూ అన్ని శాఖలూ కలిసికట్టుగా పనిచేయాలని, పనులలో వేగం మరింత పెంచాలని దాస్ కోరారు.
అనంతరం, ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎస్.కె.జోషి మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా ప్రణాళికా బద్ధంగా పని చేస్తున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఈ ప్రాజెక్టు పనులను నిరంతరం సమీక్షిస్తున్నారని, నిర్ణీత గడువు లోపే ఈ ప్రాజెక్టును పూర్తి చేసి రికార్డు నెలకొల్పుతామని అన్నారు.