Andhra Pradesh: ప్రభుత్వ నూతన కల్లు గీత పాలసీపై 'ఏపీ కల్లుగీత కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్' చైర్మన్ హర్షం

  • ఈ పాలసీ ద్వారా గీత కార్మికులకు ఎంతో మేలు జరుగుతుంది
  • పన్ను మినహాయింపుతో పాటు కల్లు విక్రయించే పరిధిని పెంచారు
  • ఏపీ కల్లుగీత కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ తాతా జయప్రకాష్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన కల్లు పాలసీ 2017-22పై ఏపీ కల్లుగీత కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ తాతా జయప్రకాష్ నారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఏపీ సచివాలయంలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నూతన కల్లు పాలసీపై ప్రభుత్వం జీవో నెం.11 జారీ చేసిందని, ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలో కల్లు గీత కార్మికులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. నూతన పాలసీలో భాగంగా పన్ను మినహాయింపుతో పాటు కల్లు విక్రయించుకునే పరిధిని పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా కల్లు గీత కార్మికులకు ఆర్థికంగా ఎంతో లాభదాయకమని అన్నారు.

ఈ నూతన పాలసీలో భాగంగా కల్లు గీత కార్మికుల నుంచి వసూలు చేసే పన్నును ప్రభుత్వం నిలిపేసిందని, దీని వల్ల రాష్ట్రంలో ఉన్న లక్షా ఆరు వేల మంది గీత కార్మికులకు ఏటా రూ.3.43 కోట్ల రూపాయల మేర లబ్ధి కలుగుతోందని, కల్లు తీసే చెట్టు నుంచి 50 -100 కిలో మీటర్ల పరిధిలో ఉంటే పట్టణాల్లో కల్లు విక్రయించుకునే సౌలభ్యం రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం సంతోషదాయకమైన విషయమని అన్నారు. కల్లుతీసే సమయంలో చెట్టుపై నుంచి కింద పడి అంగవైకల్యం పొందిన గీత కార్మికులకు వయస్సుతో నిమిత్తం లేకుండా, వికలాంగులకు అందజేసే విధంగా పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

అటవీశాఖ, హార్టీకల్చర్ తో పాటు వనసేవా సమితి ఆధ్వర్యంలో తాటిచెట్ల పెంపకం చేపట్టాలని భావిస్తోందని, కల్లుగీత కార్మికుల సంక్షేమం దృష్ట్యా నూతన కల్లు పాలసీని రూపొందించిన సీఎం చంద్రబాబునాయుడుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని జయప్రకాష్ నారాయణ అన్నారు.

  • Loading...

More Telugu News