Kamal Haasan: అప్పుడు ‘సాగరసంగమం’లో నన్ను నటించొద్దని చాలా మంది అన్నారు: సినీ నటి జయప్రద

  • ఆ పాత్రలో నటిస్తే నా కెరీర్ దెబ్బతింటుందని నిరుత్సాహపరిచారు
  • నా కెరీర్ పోయినా ఫర్వాలేదని వాళ్లకు చెప్పా
  • ఈ సినిమా తర్వాత నేను రిటైర్ అయిపోయినా కూడా ఫర్వాలేదనుకున్నా 

కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో నాడు తెరకెక్కిన ‘సాగరసంగమం’ చిత్రంలో కమలహాసన్ పోషించిన బాలు పాత్ర, జయప్రద చేసిన మాధవి పాత్ర ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిన విషయమే. ఈ చిత్రం గురించి ‘ఐ డ్రీమ్స్’ ఇంటర్వ్యూలో నటి జయప్రద మాట్లాడుతూ, ‘‘సాగరసంగమం’ గురించి ఐదు నిమిషాల్లో వర్ణించడం నాకు సాధ్యం కాదు. అదో కావ్యం. నేను నటించిన ఆణిముత్యాల లాంటి చిత్రాల్లో ప్రథమ శ్రేణిలో ఉండే చిత్రం ‘సాగరసంగమం’. ఈ సినిమాలో మాధవి క్యారెక్టర్ నాకు లభించడం ఎన్నో జన్మల పుణ్యమని నాకు అనిపిస్తుంది.

ఒక ఆర్టిస్ట్ కు ఈ పాత్ర ఛాలెంజ్ లాంటిది. ఈ పాత్రను నేనొక్కదానినే అయితే చేయలేను. నాతో పాటు నా డైరెక్టర్ నిలబడ్డారు. ఈ సినిమాలో ఒక్కో షాట్ ని చూస్తే.. మామూలుగా ఒక హీరోయిన్ చేసే క్యారెక్టర్ గా అనిపించదు. ‘సాగరసంగమం’లో నాకు నటించే అవకాశం వచ్చినప్పుడు, తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా కమర్షియల్ చిత్రాల్లో నటిస్తున్నాను. ‘సాగరసంగమం’లో ఆ పాత్ర చెయ్యొద్దని, అది ఓల్డ్ పాత్ర అని.. నా కెరీర్ దెబ్బతింటుందని చాలామంది నన్ను నిరుత్సాహపరిచారు. నా కెరీర్ పోనీ, అవకాశాలు రాకపోనీ ఈ సినిమా తర్వాత నేను రిటైర్ అయిపోయినా కూడా ఫర్వాలేదని అనుకున్నాను’ అని చెప్పుకొచ్చారు.

More Telugu News