Jagan: సీఎం చంద్రబాబు ఎదుట వైఎస్సార్‌ను పొగిడిన వైసీపీ నేత అవినాశ్ రెడ్డి.. సభలో గందరగోళం!
- పులివెందులలో చంద్రబాబు పర్యటన
- జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం
- వైఎస్సార్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని వేదికపై మాట్లాడిన వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి
- మైక్ కట్ చేసిన వైనం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ నియోజక వర్గం కడప జిల్లా పులివెందులలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. అక్కడ జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో చంద్రబాబు వేదికపై ఉండగా, వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి స్థానిక ఎంపీగా ప్రసంగించారు. మైకు తీసుకున్న వెంటనే వైఎస్.రాజశేఖర్ రెడ్డిని పొగడడం ప్రారంభించారు. కడప జిల్లాలో వైఎస్సార్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. దీంతో వేదికపై గందరగోళం చెలరేగింది. దీంతో ఆయన మైకును కట్ చేశారు.
దీనిపై కల్పించుకున్న చంద్రబాబు ఈ వేదికపై ఎటువంటి రాజకీయాలు చేయకూడదని అన్నారు. వైసీపీ నేత చేసిన వ్యాఖ్యలను కూడా తాను ఈ వేదికపై ఖండించబోనని అన్నారు. అందరూ విలువలతో నడుచుకోవాలని అన్నారు. మంచి పని కోసం తాను పులివెందులకు వచ్చానని, ఈ సమయంలో రాజకీయ విషయాలను మాట్లాడకూడదని హెచ్చరించారు. తాను రాయలసీమను రతనాల సీమగా చేస్తానని అన్నారు. అందుకోసం కృషి చేస్తున్నామని తెలిపారు.