KCR: భారతదేశ యాదవ, కురుమ జాతికి తెలంగాణ దిక్సూచి కావాలి: సీఎం కేసీఆర్
- గొల్ల, కురుమల సంక్షేమ భవనాల సముదాయానికి శంకుస్థాపన చేసిన కేసీఆర్
- గొల్ల, కురుమలలో అనాథలకు ఇక్కడ అన్నం, విద్య దొరకాలి
- గొల్ల, కురుమ నిధి కోసం రూ. కోటి మంజూరు చేస్తున్నా: కేసీఆర్
భారతదేశ యాదవ, కురుమ జాతికి తెలంగాణ దిక్సూచి కావాలని సీఎం కేసీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో గొల్ల, కురుమల సంక్షేమ భవనాల సముదాయానికి ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, గొల్ల, కురుమలలో అనాథలకు ఇక్కడ అన్నం, విద్య దొరకాలని, ఇక్కడి కల్యాణ మంటపంలో తల్లిదండ్రులు లేని పిల్లలు, పేదల పెళ్లిళ్లు జరగాలని అన్నారు. సంకల్పం, శక్తి ఉంటే గొల్ల, కురుమ నిధి ఏర్పాటవుతుందని చెప్పిన కేసీఆర్, ఈ నిధి కోసం బీసీ సంక్షేమ శాఖ నుంచి రూ. కోటి మంజూరు చేస్తున్నానని ప్రకటించారు.
కంప్యూటర్లను మించిన మానవ వనరులు గొల్ల, కురుమలేనని, తెలంగాణ రాష్ట్రంలో పంపిణీ చేసిన గొర్రెలు, వాటి పిల్లలు కలిపి 48 లక్షలు ఉన్నాయని అన్నారు. వేల కోట్ల రూపాయల సంపదను యాదవులు సృష్టించబోతున్నారని, మూడు, నాలుగేళ్లలో అత్యంత ధనికులైన గొల్ల, కురుమలు తెలంగాణలో ఉంటారని ఈ సందర్బంగా కేసీఆర్ అన్నారు. పశువులు, గొర్రెల కోసం వంద మొబైల్ వ్యాన్లు ఏర్పాటు చేశామని కేసీఆర్ చెప్పారు.