Andhra Pradesh: ఏపీ ఆర్థికాభివృద్ధికి చంద్రబాబు చేస్తున్న కృషి ప్రశంసనీయం: ప్రముఖ ఆర్థిక వేత్త కౌశిక్ బసు
- గుంటూరులో ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ సదస్సు
- ఏపీ అభివృద్ధిపై భరోసా వ్యక్తం చేసిన ఆర్థిక వేత్త
- ఆర్థిక సంస్కరణల అమలుపై ఆలోచించే అతికొద్ది మంది నేతల్లో చంద్రబాబు ఒకరని ప్రశంస
ఏపీ ఆర్థికాభివృద్ధికి చంద్రబాబు చేస్తున్న కృషి ప్రశంసనీయమని ప్రముఖ ఆర్థిక వేత్త కౌశిక్ బసు అన్నారు. గుంటూరులో నిర్వహించిన ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కౌశిక్ బసు మాట్లాడుతూ, ఏపీ అభివృద్ధిపై భరోసా వ్యక్తం చేసిన ఆయన, ఆర్థిక సంస్కరణల అమలు విషయాలపై ఆలోచించే అతికొద్ది మంది నేతల్లో చంద్రబాబు ఒకరని ప్రశంసించారు.
కొత్త రాష్ట్రంగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఏపీ, ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపుతోందని కితాబిచ్చారు. న్యూయార్క్ లోని కొన్ని ప్రాంతాల్లో ఇంగ్లీషు భాష మాట్లాడే వారి తర్వాత తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్యే ఎక్కువగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా పెద్ద నోట్ల రద్దు గురించి మాట్లాడుతూ, దీని వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు తగ్గిందని, ఈ త్రైమాసికం తర్వాత నోట్ల రద్దు ప్రభావం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. జీఎస్టీ గురించి ప్రస్తావిస్తూ..ఇది దేశానికి అవసరమే కానీ, అమలు తీరు సక్రమంగా లేదని విమర్శించారు.