Andhra Pradesh: రాహుల్‌ని ప్రధానిని చేయడమే మన లక్ష్యం కావాలి : కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి
- విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- త్యాగాలకు నిలయమైన ఆ కుటుంబానికి మనం అండగా నిలవాలి
- స్వాతంత్ర్య సమరయోధులకు రఘువీరా చేతుల మీదుగా సన్మానం
ఈ దేశం ఎప్పుడు ఇబ్బందుల్లో ఉంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ త్యాగాలకు సిద్ధమవుతుందని, త్యాగాలకు నిలయమైన గాంధీ కుటుంబానికి మనం అండగా నిలవాలని ఏపీసీసీ చీఫ్ ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. విజయవాడలో 133వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ, రెండవసారి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు గాంధీ భవన్లో అప్పటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రమాణం చేయించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.
‘ఒకటి ఇందిరమ్మ రాజ్యం-ఇంటింటా సౌభాగ్యం. రెండవది రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం’ అని నాడు వైఎస్ ప్రస్తావించిన మాటలను ఆయన గుర్తుచేసుకున్నారు. రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే మనందరి లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. కాగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించారు.