: 'తులసి' మాట్లాడగలదట!
హిందువులకు తులసి మొక్క ఎంతో పవిత్రమైనది. దీనికున్న ఔషధ విలువలు అపారం. తులసి ఆకులు, గింజలను వివిధ వ్యాధులకు నివారణిగా వినియోగిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ తులసి మొక్కలు తమ పక్కనున్న మొక్కలతో సంభాషిస్తాయని పరిశోధకులు అంటున్నారు. పశ్చిమ ఆస్ట్రేలియా యూనివర్శిటీ శాస్త్రవేత్తల బృందం ఈ విషయమై అధ్యయనం చేపట్టింది. ఈ పరిశోధనలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తమ పరిశోధనలో భాగంగా.. ఓ తులసి మొక్క చుట్టూ రెండు వరుసల్లో కొన్ని మిరప విత్తనాలను నాటారు. మరొక ప్రదేశంలో తులసి చెట్టు లేకుండానే విడిగా మిరపవిత్తనాలు నాటారు. విడిగా ఉన్న మిరప విత్తుల కంటే తులసి మొక్క చుట్టూ ఉన్న మిరప విత్తనాలు చాలా వేగంగా మొలకెత్తాయట. ఈ పరిణామం శాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో ముంచెత్తింది.
మరికొంచెం లోతుగా పరిశోధించగా, తులసి మొక్క తోటి మొక్కలకు సేంద్రియ పదార్థాలను, వేర్ల ద్వారా తేమనూ అందిస్తుందని తేలింది. వివిధ భాగాల్లో ఉత్పత్తి అయ్యే రసాయనాల ద్వారానే కాకుండా, స్పర్శతోనూ 'తులసి' తోటి మొక్కలతో సంభాషించడం ద్వారా వాటి అవసరాలను తీర్చుతుందని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన మోనికా గాగ్లియానో అంటున్నారు.