Chandrababu: ఇది చరిత్రను సృష్టించే కార్యక్రమం: చ‌ంద్ర‌బాబు

  • ఏపీ ఫైబర్ నెట్ ప్రారంభం సంద‌ర్భంగా చంద్ర‌బాబు ప్ర‌సంగం
  • దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శంగా ఉండే విధంగా టెక్నాలజీని తెస్తాం
  •  ఫైబర్ గ్రిడ్ రూ.5వేల కోట్ల ప్రాజెక్ట్
  • అరకు వంటి గిరిజన ప్రాంతాలకు కూడా వైర్ లెస్ నెట్ కనెక్షన్ ఇస్తాం

ఈ రోజు అమ‌రావ‌తిలో ఏపీ ఫైబర్ నెట్ ను ప్రారంభించి రాష్ట్ర ప్రజలకు అంకితం చేసిన విష‌యం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 24 వేల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ లైన్లు ఏర్పాటు చేసిన‌ ఏపీ ప్ర‌భుత్వంపై రామ్‌నాథ్ కోవింద్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ వివ‌రాలు తెలిపారు. ఇంటి అవసరాలకు 15 నుంచి 20 ఎంబీపీఎస్ స్పీడ్ నెట్, టీవీ, టెలిఫోన్ సౌకర్యాల‌ను రూ.149లకు అందిస్తామ‌ని అన్నారు.

ఇది చరిత్రను సృష్టించే కార్యక్రమం అని చంద్రబాబు అన్నారు. దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శంగా ఉండే విధంగా టెక్నాలజీని వినియోగంలోకి తెస్తామని చెప్పారు. అందరూ విద్యపై శ్రద్ధ చూపిస్తున్నారని, రాష్ట్ర ప్రజలకు బ్రహ్మాండమైన భవిష్యత్ ఉందని అన్నారు. ప్రపంచం మొత్తం మీద ఐటీ నిపుణులలో నూటికి నలుగురు భారతీయులు ఉన్నారని, ఆ నలుగురిలో ఒకరు తెలుగువారని, సత్య నాదెండ్ల వంటి వారిని గుర్తు చేశారు.

పారిశ్రామిక విప్లవంతో యాంత్రీకరణ మొదలైందని, విద్యుత్ దానికి ఊతం ఇచ్చిందని, 1990లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత పెరిగినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పుడు 4వ ఐటీ రివల్యూషన్, ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటి) మొదలైందన్నారు. ఫైబర్ గ్రిడ్ రూ.5వేల కోట్ల ప్రాజెక్ట్ అని తెలిపారు. రూ.860 కోట్ల వ్యయంతో ప్రతి పంచాయతీకి ఫైబర్ నెట్, వైఫై కనెక్షన్ ఇస్తామని చెప్పారు. ట్రిపుల్ ప్లే బాక్లుల కొరత వల్ల ఆలస్యమైనట్లు తెలిపారు. గూగుల్ ఎక్స్ సంస్థ సహకారంతో ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మారుమూల ఉండే పాడేరు, అరకు వంటి గిరిజన ప్రాంతాలకు కూడా వైర్ లెస్ నెట్ కనెక్షన్ ఇస్తామని చెప్పారు.

విద్య, ఆరోగ్యం, వ్యవసాయ తదితర రంగాల్లో దీనిని ఉపయోగిస్తామని చంద్రబాబు చెప్పారు. ఆడవారు పనిమీద బయటకు వెళ్లినప్పుడు మగవారు ఇంట్లోనే వీడియో చూస్తూ కాఫీ పెట్టుకునే సౌకర్యం కల్పిస్తామని నవ్వుతూ అన్నారు. అమరావతి గ్రీన్ సిటీ నిర్మాణానికి రూ.50 వేల కోట్ల విలువైన 33,500 ఎకరాల భూమి ఇచ్చిన రైతులకు మరోసారి అభినందనలు తెలిపారు. తమ రాష్ట్ర ప్రజలు తెలివైనవారని, దేనినైనా సాధించగలరని అన్నారు. వారి సహకారంతోనే తాము ఈ విజయాలు సాధిస్తున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News