bhumma: వారి హామీలను నెరవేరిస్తే కూతురిగా సంతృప్తి చెందుతా: భూమా అఖిలప్రియ
- భూమా కుటుంబానికి ప్రజల్లో ఓ బ్రాండ్ ఉంది
- ఆ బ్రాండ్ ను మేము ముందుకు తీసుకెళితే చాలు
- నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాలను ఇంకా అభివృద్ధి చేస్తాం
ప్రజలకు తన తల్లిదండ్రులు ఇచ్చిన హామీలను నెరవేరిస్తే వారి కూతురుగా తనకు సంతృప్తి కలుగుతుందని ఏపీ మంత్రి అఖిలప్రియ అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన తల్లిదండ్రులు భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డిల హయాంలో నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాలను అభివృద్ధి చేశారని, ఇప్పుడు ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు.
తన దృష్టి కేవలం ఆళ్లగడ్డపైనే కాకుండా నంద్యాల, కర్నూలు..మొత్తం రాష్ట్రంపై ఉందని అన్నారు . ‘భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డికి ప్రజల్లో ఉన్న బ్రాండ్ ను నేను ముందుకు తీసుకువెళితే చాలు. మా తల్లిదండ్రులిద్దరు మాకు ఉన్నత ప్రమాణాలను సూచించారు. అందులో పది శాతం అందుకున్నా చాలు. భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డిని అభిమానించే ప్రజలు చాలామంది ఉన్నారు. వారి నమ్మకాన్ని మేము ముందుకు తీసుకువెళితే చాలు’ అని చెప్పుకొచ్చారు.