: అశ్లీల చిత్రాలు వస్తున్నాయని చూడకుండా ఉంటున్నామా?: ఎస్పీ బాలు


చిన్న సినిమా భవితవ్యంపై ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. అశ్లీల చిత్రాలు వస్తున్నాయని చూడకుండా ఉంటున్నామా? ఆ సినిమాలను నిలిపివేస్తున్నారా? అని ప్రశ్నించిన బాలు.. తెలుగుదనం ఉట్టిపడే చిత్రాలను ఆదరించాలని సూచించారు. తిరుపతిలో జరిగిన ఓ కళాశాల ప్రారంభోత్సవంలో బాలు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'మిథునం' వంటి సత్తా ఉన్న చిత్రాలను ఆదరించినప్పుడే మున్ముందు మంచి సినిమాలు వస్తాయని బాలు ఆశాభావం వ్యక్తం చేశారు. తద్వారా దమ్మున్న నిర్మాతలు మరింతమంది సినీ రంగంలో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతారని అభిప్రాయపడ్డారు. తనికెళ్ళ భరణి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'మిథునం' చిత్రం ప్రపంచస్థాయి ఖ్యాతి స్వంతం చేసుకుంటుందని బాలు చెప్పారు.

ఇక ప్రస్తుత సంగీత రీతులకు తగ్గట్టుగా తాను పాడలేనని బాలు అంగీకరించారు. తన సంగీత జ్ఞానం మేరకు పాటలు పాడించుకునే నిర్మాతలు ముందుకువస్తే పాడతానని బాలు అన్నారు.

  • Loading...

More Telugu News