gandhi hospital: గాంధీ ఆసుప‌త్రిలో ఇక‌పై 20 ప‌డ‌క‌ల డ‌యాల‌సిస్ కేంద్రం!

  • రేపు ప్రారంభించ‌నున్న వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి
  • స‌గ‌టున రోజుకు 80 సెష‌న్స్ డయాల‌సిస్ చేసే అవ‌కాశం
  • తెలంగాణ వ్యాప్తంగా 40 డ‌యాలిసిస్ కేంద్రాల ఏర్పాటే ల‌క్ష్యం
  • ఇప్ప‌టికే ప‌లు ప్రాంతాల్లో అత్యాధునిక డ‌యాల‌సిస్ కేంద్రాలు

హైద‌రాబాద్‌లోని గాంధీ ఆసుప‌త్రిలో మ‌రో డ‌యాల‌సిస్ కేంద్రం అందుబాటులోకి రానుంది. 20 ప‌డ‌క‌ల డ‌యాల‌సిస్ కేంద్రాన్ని రేపు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి ప్రారంభించ‌నున్నారు. ఇప్పటికే అగ‌ర్వాల్ స‌మాజ్ స‌హాయ‌త ట్ర‌స్ట్ త‌ర‌పున 29 జ‌న‌వ‌రి 2017న 6 డ‌యాల‌సిస్ మిష‌న్లను మంత్రి ల‌క్ష్మారెడ్డి ప్రారంభించారు. వీటి ద్వారా రోగులకు డయాలసిస్ చికిత్స అందిస్తున్నారు.

రాష్ట్రంలో మొత్తం 40 డ‌యాల‌సిస్ కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల‌ని తెలంగాణ‌ ప్ర‌భుత్వం సంక‌ల్పించింది. ఇందులో భాగంగా రేపు పీపీపీ (ప‌బ్లిక్‌-ప్రైవేట్‌-పార్టిసిపేష‌న్‌) ప‌ద్ధ‌తిలో 20 ప‌డ‌క‌ల డ‌యాల‌సిస్ కేంద్రం అందుబాటులోకి రానున్న‌ది. దీని ద్వారా స‌గ‌టున రోజుకు 80 సెష‌న్స్ డయాల‌సిస్ చేసే అవ‌కాశం క‌లుగుతుంది. ట్ర‌స్ట్‌తో క‌లుపుకుంటే 100కు పైగా సెష‌న్స్ ప్ర‌తి రోజూ చేయ‌డానికి వీలు క‌లుగుతుంది.

సింగిల్ యూజ్డ్ ఫిల్ట‌ర్లు
తెలంగాణ వ్యాప్తంగా 40 డ‌యాలిసిస్ కేంద్రాల‌ను ప్ర‌భుత్వం ప్రారంభిస్తోంది. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప్ర‌భుత్వ రంగంలో సింగిల్ యూజ్డ్ ఫిల్ట‌ర్ల‌ను ఉప‌యోగిస్తున్నారు. దీంతో ఎలాంటి ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటుంది. కిడ్నీ బాధితుల‌కు ఇది మ‌రింత‌గా ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య‌క‌ర‌మైన విధానం. కాగా, ఇప్ప‌టివ‌ర‌కు ఏడు ఆసుపత్రుల్లో డ‌యాల‌సిస్ కేంద్రాలు ప్రారంభ‌మ‌య్యాయి. సిద్దిపేట‌, సిరిసిల్ల‌, సంగారెడ్డి, గ‌ద్వాల‌, వ‌న‌ప‌ర్తి, మ‌ల‌క్‌పేట‌, వ‌న‌స్థ‌లిపురంల‌లో డ‌యాల‌సిస్ కేంద్రాల‌ను మంత్రి ల‌క్ష్మారెడ్డి ప్రారంభించారు.

హైద‌రాబాద్‌లో నిమ్స్‌లో ఈ మ‌ధ్యే డ‌యాల‌సిస్ కేంద్రం ప్రారంభ‌మైంది. రేప‌టి నుంచి గాంధీ ఆసుప‌త్రిలో 20 ప‌డ‌క‌ల డ‌యాల‌సిస్ కేంద్రం అందుబాటులోకి వస్తుంది. ఇప్ప‌టికే 60 ప‌డ‌క‌ల ఆధునిక ఐసీయూ కూడా గాంధీలో ఏర్పాటైంది. మ‌రిన్ని స‌దుపాయాల క‌ల్ప‌న‌కు గాంధీ వేదిక కానుంది. అత్యాధునిక వైద్యం నిరుపేద‌ల‌కు అందాల‌న్న సీఎం కేసీఆర్ సంక‌ల్పానికి నిలువుట‌ద్దంలా మంత్రి ల‌క్ష్మారెడ్డి చొర‌వ‌తో డ‌యాల‌సిస్ కేంద్రాలు ప్రారంభ‌మ‌వుతున్నాయి.

More Telugu News