రామ్ నాథ్ కోవింద్: రామ్ నాథ్ కోవింద్ నోటి వెంట.. తెలుగు కవుల పేర్లు, హైదరాబాద్ బిర్యానీ, ‘బాహుబలి’!
- ముగిసిన ప్రపంచ తెలుగు మహాసభలు
- ‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా ..’ గేయాన్ని ఉటంకించిన కోవింద్
- ఐదు రోజుల పాటు ఘనంగా జరిగిన మహాసభలు
హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలు ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విచ్చేశారు. ‘సోదర సోదరీమణులారా నమస్కారం..’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన కోవింద్, ప్రముఖ కవి రాయప్రోలు సుబ్బారావు రచించిన ‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని..’ అనే గేయాన్ని ప్రస్తావిస్తూ తన ప్రసంగాన్ని ఆయన ముగించారు.
రామ్ నాథ్ కోవింద్ తన ప్రసంగంలో తెలుగు కవుల పేర్లు, గిరిజన హక్కుల కోసం పోరాడిన కొమ్రం భీమ్ వంటి వీరులు, మాజీ రాష్ట్రపతులు రాధాకృష్ణన్, వీవీ గిరి, నీలం సంజీవరెడ్డి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హైదరాబాద్ బిర్యానీ, ‘బాహుబలి’, బ్యాడ్మింటన్..గురించి ప్రస్తావించారు. కాగా, ఈ నెల 15న ప్రారంభమైన ప్రపంచ తెలుగు మహాసభలను ఐదురోజుల పాటు ఎంతో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది.