గవ్వల బాబా: అమాయక ప్రజలను మోసం చేస్తున్న 'గవ్వల' బాబా అరెస్ట్!
- గవ్వల బాబా అలియాస్ నడిగొట్టు రాజేష్
- మంత్రాలు, పూజల పేరిట మోసం
- బాబాను అరెస్టు చేసి కేసు నమోదు చేసిన పోలీసులు
సంతానం లేని వారికి సంతానం పుట్టేలా చేస్తానని, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేలా చేస్తానని, అనారోగ్యవంతులను ఆరోగ్య వంతులను చేస్తానంటూ మంత్రతంత్రాలు, మాయ మాటలతో అమాయక ప్రజలను మోసం చేస్తూ డబ్బులు గుంజుతున్న గవ్వల బాబా అలియాస్ నడిగొట్టు రాజేష్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ లోని ఇందిరమ్మ కాలనీ రేకుర్తికి చెందిన నడిగొట్టు రాజేష్, తన దగ్గరకు పలు సమస్యలతో వచ్చే వారి పేరిట గవ్వలు వేస్తుంటాడు. గవ్వలు వేయగా వచ్చే సంఖ్యను ఆధారంగా చేసుకుని ‘మీకు మంచి జరగదు’ అని చెప్పి.. పూజలు చేయాలని, తాయత్తులు కట్టాలని చెబుతూ వారిని ప్రలోభ పెట్టి, డబ్బులు గుంజుతుంటాడు.
ఈ నేపథ్యంలో బాధితుల నుంచి ఫిర్యాదులు అందడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దృష్టి పెట్టారు. అతని కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఈరోజు అతన్ని పట్టుకున్నారు. స్థానిక కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో రాజేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.