BJP: ఆసేతు హిమాచలం బీజేపీ... కాంగ్రెస్ కు మిగిలింది ఆ నాలుగే!

  • పంజాబ్, కర్ణాటక, మిజోరాం, మేఘాలయా మాత్రమే కాంగ్రెస్ చేతిలో
  • ప్రాంతీయ పార్టీల చేతుల్లో మరో ఐదు రాష్ట్రాలు
  • మిగతా అన్ని రాష్ట్రాల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బీజేపీ

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ఇప్పుడిక దక్షిణాది మినహా దేశవ్యాప్తంగా విస్తరించినట్టే. గుజరాత్ ను నిలుపుకోవడం, కాంగ్రెస్ పాలనలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ ను సొంతం చేసుకోవడంతో, ఆ పార్టీ మరింత బలోపేతమైంది. ఇదే సమయంలో ఇక దేశంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్నది కేవలం నాలుగంటే నాలుగు రాష్ట్రాలు మాత్రమే. మిజోరాం, మేఘాలయా, పంజాబ్, కర్ణాటక మినహా మరే రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ మిగల్లేదు.

ఒడిశాలో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ, పశ్చిమ బెంగాల్, కేరళలో వామపక్షాలు, తమిళనాడులో అన్నాడీఎంకే, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలు రాజ్యాలు ఏలుతున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాలను పక్కనబెడితే, మిగతా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ లేదా ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని అధికారంలో ఉన్న పార్టీలు పాలన సాగిస్తున్నాయి. ఇక కమలనాథుల తదుపరి టార్గెట్ వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలే.

ఈ క్రమంలో తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలను పక్కనబెడితే, కాంగ్రెస్ అధీనంలో ఉన్న కర్ణాటకను దక్కించుకోవాలన్నది ఆ పార్టీ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. కర్ణాటకతో పాటు మేఘాలయా, నాగాలాండ్, త్రిపుర, కర్ణాటక, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాలన్నింటిలో పాగా వేయాలని బీజేపీ భావిస్తుండగా, బీజేపీ పాలన కొనసాగుతున్న రాష్ట్రాల్లో ప్రజా వ్యతిరేకతను తమకు బలంగా మలచుకుని రాజస్థాన్, మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్ వంటి పెద్ద రాష్ట్రాలను దక్కించుకోవాలని కాంగ్రెస్ తనవంతు ప్రయత్నాలు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News