ప్రపంచ తెలుగు మహాసభలు: ఆ మూడు అక్షరాలు వింటే నా రక్తం ఉప్పొంగుతుంది..ఈ మూడు అక్షరాలు వింటే నా తనువు పులకిస్తుంది: హీరో బాలకృష్ణ

  • ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న బాలకృష్ణ
  • పరాయి భాష అనే డబ్బాపాలపై మోజు పెరిగిపోయింది
  • ఇంకా పాతికేళ్లు పోతే ఆ పదాలు తెలుగు శబ్దాలయ్యే ప్రమాదం ఉంది: బాలయ్య

‘ఎన్ టి ఆర్’ అనే మూడు అక్షరాలు వింటే తన రక్తం ఉప్పొంగుతుందని..‘ తెలుగు’ అనే మూడు అక్షరాలు వింటే  తన తనువు పులకిస్తుందని ప్రముఖ హీరో బాలకృష్ణ అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, ఐదు వేల సంవత్సరాల క్రితమే తెలుగు జాతికి పునాది పడిందని మనకు అర్థమౌతుందని అన్నారు. పూజ్య బాపూజీ ‘మాతృభాష తల్లిపాలు లాంటిది’ అని ఒక గొప్ప మాట చెప్పారని, మన వాళ్లకు మాత్రం పరాయి భాష అనే డబ్బాపాలపై మోజు పెరిగిపోయిందని అన్నారు.

అమ్మను అమ్మా అని, తండ్రిని డాడీ అని పిలిపించుకుంటున్నారని, ఇంకా పాతికేళ్లు పోతే, ‘మమ్మీ’, ‘డాడీ’ లే అచ్చమైన తెలుగు శబ్దాలు అయిపోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. ‘తెలుగుభాష ఎంతో రమణీయమైంది. కమనీయమైంది. తెలుగు భాషలో గోదావరి ఒంపులు, కృష్ణవేణి సొంపులు, నెల్లూరి నెరజాణ తనం, రాయలసీమ రాజసం ఉన్నాయి. తెలంగాణ మాగాణం తెలుగు భాష.. కోనసీమ లేత కొబ్బరి నీరు తెలుగు భాష’ అటువంటి భాషను మనం మాట్లాడుకుంటున్నందుకు మనం గర్వపడాలి, అటువంటి జాతిలో పుట్టినందుకు మనం ఆనందించాలి, మన జాతిని, మన భాషను మనం గౌరవించాలి' అని బాలకృష్ణ అన్నారు.

తెలుగు వాళ్లందరినీ ఒకచోట చేర్చిన సీఎం కేసీఆర్ సహృదయత, భాషాభిమానానికి యావత్తు ఆంధ్రా, తెలంగాణ ప్రజానీకం తరపున కృతజ్ఞతలు చెబుతున్నానని బాలయ్య అన్నారు. కాగా, తెలుగు మహాసభలకు పంచెకట్టుతో హాజరైన బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

  • Loading...

More Telugu News