యార్లగడ్డ లక్ష్మీప్రసాద్: అప్పుడు, నా సమాధానం విని ఎన్టీఆర్ పకపకా నవ్వారు: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
- ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర ’ ప్రారంభించినపుడు రమ్మంటే నేను వెళ్లలేదు
- ఎన్టీఆర్ సీఎం పదవి నుంచి దిగిన మొదటిరోజే ఆయన్ని కలిశా
- అప్పుడు, నా మాటలు విని ఎన్టీఆర్ నవ్వుకున్నారు: యార్లగడ్డ
ఎన్టీఆర్ తనను రమ్మనమని పిలిచినప్పుడు తాను వెళ్ల లేదని, ఆ తర్వాత తాను ఎందుకు రాలేదనే విషయాన్ని వివరించి చెప్పడంతో ఆయన పగలబడి నవ్విన విషయాన్ని గుర్తుచేసుకున్న ప్రముఖ సాహితీవేత్త, ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నవ్వులు చిందించారు. ‘ఏబీఎన్-ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ లో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ సంఘటన గురించి ఆయన చెబుతూ, ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా ప్రారంభించినపుడు నన్ను రమ్మనమని కబురు పంపారు. నేను రానని చెప్పాను.
అయితే, ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన దిగిపోయిన తర్వాత, మొట్టమొదటిరోజున ఢిల్లీలో ఆయన్ని కలిశా. ఎన్టీఆర్ గారు నన్ను చూసి ‘మేం రమ్మంటే మీరు రాలేదు కదా!’ అని అన్నారు. ‘సార్.. క్షమించాలి. నా అభిమాన నటుడు నందమూరి తారకరామారావు గారు. అధికారంలో ఉన్న రామారావు నీళ్లలో ఉన్న మొసలి లాంటి వాడు. ఆ సందర్భంలో మీకు ఏం చెప్పినా ఇబ్బంది అవుతుంది. నాకేమో నోటి దురుసు.. అందుకే, ఇప్పుడు వచ్చాను సార్’ అని చెప్పాను. ఈ సమాధానం విన్న ఎన్టీఆర్ గారు పకపకా నవ్వారు’ అని ఆ సంఘటన గురించి యార్లగడ్డ వివరించి చెప్పారు.
కాగా, ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు.. హిందీ అకాడమీ సభ్యుడిగా తనను నియమించారని, అప్పటికి, తానెవరో ఆయనకు తెలియదని అన్నారు.