యార్లగడ్డ లక్ష్మీప్రసాద్: వెంకయ్యనాయుడు, హరిబాబు, నేను ఒకే జైలు గదిలో గడిపాం!: ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
- నేను పద్దెనిమిదేళ్ల వయసుకే జైలు శిక్ష అనుభవించా
- హరిబాబు, నేను ఒకే వయసువాళ్లం.. నాయుడు గారు మూడేళ్లు పెద్ద
- ఉత్తరాది నాయకుల హిందీ ప్రసంగాలను తెలుగులోకి అనువదించే వాడిని
- ఓ ఇంటర్వ్యూలో నాటి విషయాలను ప్రస్తావించిన యార్లగడ్డ
తాను పద్దెనిమిదేళ్ల వయసుకే హైదరాబాద్ లోని ముషీరాబాద్ సెంట్రల్ జైలులో రెండు నెలలు గడిపానని తన చిన్ననాటి విషయాలను సెంట్రల్ హిందీ కమిటీ నాన్ అఫీషియల్ సభ్యుడు, ప్రముఖ సాహితీవేత్త, ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ప్రస్తావించారు. ‘ఏబీఎన్-ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో పలు ఆసక్తికర విషయాలను ప్రస్తావించారు. ‘నేను పద్దెనిమిదేళ్ల వయసుకే మెయింటినెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్టు (ఆంతరంగిక భద్రతా చట్టం) కింద హైదరాబాద్ లోని ముషీరాబాద్ జైల్లో రెండు నెలలు ఉన్నా.
వెంకయ్యనాయుడు గారు, హరిబాబు గారు..నేను ఒక సెల్ లో ఉన్నాం. హరిబాబు, నేను ఒకే వయసువాళ్లం.. నాయుడు గారు మా కన్నా మూడేళ్లు పెద్ద. తెన్నేటి విశ్వంనాథం గారు, సర్దార్ గౌతు లచ్చన్న గారు, సుంకర సత్యనారాయణ గార్ల సాహచర్యం నాకు లభించడంతో పరిణతి పొందాను. అప్పట్లో, కాంగ్రెస్ విద్యార్థి నాయకులు ఒకవైపు, కాంగ్రెసేతర విద్యార్థి నాయకులు మరోవైపు ఉండేవారు.
నా అదృష్టం కొద్దీ, కాంగ్రెసేతర విద్యార్థి నాయకుల్లో నేను ఉన్నా. వెంకయ్యనాయుడు, హరిబాబు గార్లు యూనివర్శిటీలో నాయకులు, నేను గుడివాడ విద్యార్థి సంఘానికి నాయకుడిని. జయప్రకాష్ నారాయణ గారు 1974లో ఎమర్జెన్సీ సమయంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన సంఘర్షణ సమితి అని ఒక సంఘం ఏర్పాటు చేశారు. ఆ సంఘానికి వెంకయ్యనాయుడు గారు కన్వీనర్. ఆ సంఘంలో ఉన్న తొమ్మిది మంది సభ్యుల్లో నేను కూడా ఒకణ్ణి. అప్పటికే నేను పెద్ద వాళ్లతో తిరగడం మొదలైంది.
నా ఎస్ఎల్సీ పూర్తయ్యేటప్పటికే బీఏతో సమానమైనటువంటి రాష్ట్ర భాషా ప్రవీణ్ పూర్తి చేశాను. హిందీలో ఈ కోర్సు నేను పూర్తి చేసేందుకు మా నాన్నగారు ప్రత్యేకంగా ఓ టీచర్ ను ఏర్పాటు చేశారు. ఉత్తరాది నాయకులు ఎవరు ఆంధ్రప్రదేశ్ కు వచ్చినా.. వారి హిందీ ప్రసంగాలను అనువదించేందుకు గౌతు లచ్చన్న గారు నన్ను కారులో తీసుకెళ్లేవారు. అలా నాకు చిన్న వయసులోనే పెద్దల సాంగత్యం లభించడంతో నేను తప్పులు చేయకుండా, తప్పుడు మార్గంలో వెళ్లకుండా ఉన్నా’ అని చెప్పుకొచ్చారు.