బీజేపీ: ఎన్ని విన్యాసాలు చేసినా ‘కాంగ్రెస్’ను ప్రజలు నమ్మలేదు: బీజేపీ నేత లక్ష్మణ్
- ఊహించిన విధంగానే ఎన్నికల ఫలితాలు వచ్చాయి : లక్ష్మణ్
- కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు: కిషన్ రెడ్డి
- కాంగ్రెస్ పట్ల ప్రజలకు నమ్మకం పోయింది: బండారు దత్తాత్రేయ
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై తెలంగాణ బీజేపీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు, పటేళ్ల రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఎన్ని విన్యాసాలు చేసినా ప్రజలు నమ్మలేదని, ఊహించిన విధంగానే ఎన్నికల ఫలితాలు వచ్చాయని అన్నారు.
అరువు తెచ్చుకున్న నాయకులతో ప్రచారం చేసినప్పటికీ రాహుల్ గాంధీ ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయారని విమర్శించారు. మరో బీజేపీ నేత కిషన్ రెడ్డి మాట్లాడుతూ, 2019 ఎన్నికలకు రెఫరెండంగా ప్రత్యర్థి పార్టీలు ప్రచారం చేశాయని, కులాల వారీగా రెచ్చగొట్టిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, కాంగ్రెస్ పట్ల ప్రజలకు నమ్మకం పోయిందని అన్నారు.