రాహుల్ గాంధీ: ప్రతి ఒక్క భారతీయుడి గొంతుకగా మారేందుకు సిద్ధంగా ఉన్నా: కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు రాహుల్ గాంధీ
- దేశంపై నమ్మకంతోనే రాజకీయాల్లోకి వచ్చాను
- రాజకీయ విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది
- ప్రజల మధ్య బీజేపీ విద్వేషాలు రెచ్చగొడుతోంది
- ‘కాంగ్రెస్’ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రాహుల్
దేశంపై నమ్మకంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ప్రతి ఒక్క భారతీయుడి గొంతుకగా మారేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాహుల్ ప్రసంగిస్తూ, పదమూడేళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు.
దేశ సేవకు అంకితమైన కాంగ్రెస్ కార్యకర్తలకు రక్షణగా నిలవడం తన బాధ్యత అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మన దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకువచ్చిందని, ప్రస్తుత ప్రధాని దేశాన్ని తిరోగమనం వైపు నడిపిస్తున్నారని విమర్శించారు. రాజకీయాలు ప్రజాసేవకు ఉపయుక్తంగా లేకుండా ఉన్నాయని, రాజకీయ విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజల మధ్య బీజేపీ విద్వేషాలు రెచ్చగొడుతోందని, ఒకసారి విద్వేషాలు చెలరేగితే అణచివేయడం చాలా కష్టమని రాహుల్ అన్నారు.