పవన్ కల్యాణ్: మంగళగిరి స్థల వివాదంపై స్పందించిన ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్!

  • లీజుకు తీసుకున్నట్టు పత్రికా ప్రకటన ఇచ్చినప్పుడే నా దృష్టికి తేవాల్సింది
  • ఈ వివాదం నిజమైతే లీజ్ రద్దు చేసుకుంటాం
  • ఓ ప్రకటనలో ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్

ఏపీ రాజధాని సమీపంలో పార్టీ కార్యాలయం నిర్మాణం నిమిత్తం మంగళగిరిలోని చినకాకానిలో మూడు ఎకరాల స్థలాన్ని జనసేన పార్టీ లీజ్ కు తీసుకున్న విషయం తెలిసిందే. మూడు ఎకరాల స్థలాన్ని యార్లగడ్డ సాంబశివరావు నుంచి జనసేన పార్టీ లీజుకు తీసుకుంది. అయితే, ఈ స్థలం తమదని, ఇది వివాదంలో ఉందని షేఫ్ షఫీ అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చారు.

దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ, అంజుమన్ ఇస్లామిక్ కమిటీ సభ్యులు చేసిన ఆరోపణలు తన దృష్టికి వచ్చాయని, ఈ వివాదం నిజమైతే లీజ్ రద్దు చేసుకుంటామని అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటనను జనసేన పార్టీ విడుదల చేసింది. మూడు ఎకరాల స్థలాన్ని మూడున్నరేళ్లకు లీజుకు తీసుకున్నామని అన్నారు. ఈ విషయంపై పత్రికా ప్రకటన ఇచ్చామని, వివాదం వున్న విషయాన్ని, అప్పుడే తన దృష్టికి తీసుకువచ్చి ఉంటే బాగుండేదని పవన్ అన్నారు.

కానీ, ఇప్పుడు, ఓ రాజకీయవేత్త సమక్షంలో మీడియా ముందుకు రావడం అనుమానించాల్సి వస్తోందని అన్నారు. ఇది రాజకీయ కుట్ర అయితే కనుక, పోరాడే బలం ‘జనసేన’కు ఉందని పవన్ పేర్కొన్నారు. త్వరలోనే న్యాయ నిపుణులతో కలసి జనసేన ప్రతినిధులు చినకాకాని వస్తారని, సంబంధిత డాక్యుమెంట్లను వారికి ముస్లిం పెద్దలు ఇవ్వాలని కోరారు. ఆ స్థలం వారిదని నిర్ధారణ అయిన మరుక్షణమే జనసేన పార్టీ ఆ స్థలానికి దూరంగా ఉంటుందని ఆ ప్రకటనలో పవన్ హామీ ఇచ్చారు. 

  • Loading...

More Telugu News