బాలీవుడ్: బాలీవుడ్ నటుడు నీరజ్ ఓరా మృతి .. ప్రధాని మోదీ సంతాపం

  • నాలుగు రోజులుగా వెంటిలేటర్ పై ఉన్న నీరజ్ వోరా
  • ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • సంతాపం వ్యక్తం చేసిన బాలీవుడ్

అనారోగ్యం కారణంగా బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు, నటుడు, రచయిత నీరజ్ వోరా (54) మృతి చెందారు. గత నాలుగు రోజులుగా వెంటిలేటర్ పై ఉన్న నీరజ్ వోరా ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్టు ఆయన స్నేహితుడు, నిర్మాత నదియాద్ వాలా పేర్కొన్నారు.

గత ఏడాది నీరజ్ వోరాకు గుండెపోటు రావడంతో పాటు బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చింది. ఆ సమయంలో ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లారు. దాదాపు ఏడాదిపాటు ఆయన కోమాలోనే ఉన్నారు. కొంతకాలం తర్వాత ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో ఈ ఏడాది మార్చిలో ముంబైకి తీసుకువచ్చారు.  ప్రముఖ నిర్మాత నదియాద్ వాలాకు వోరా స్నేహితుడు కావడంతో, ఆయన్ని తన ఇంట్లోనే పెట్టుకుని చికిత్స అందించారు.

వారం రోజుల క్రితం నీరజ్ ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు. నీరజ్ భార్య కొంత కాలం క్రితమే మృతి చెందారు. వారికి సంతానం లేదు. వెల్ కం బ్యాక్, బోల్ బచ్చన్, ధడకన్ తదితర చిత్రాల్లో ఆయన నటించారు. ‘ఖిలాడి 420’, ‘గోల్ మాల్’ చిత్రాలకు రచయితగా పని చేశారు. కాగా, నీరజ్ వోరా మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్ నటులు సంతాపం తెలిపారు.

  • Loading...

More Telugu News