తెలుగు మహాసభలు: తెలుగు మహాసభల దృష్ట్యా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు!
- 15 నుంచి 19వ తేదీ వరకు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు
- ఎల్బీ స్టేడియం, రవీంద్రభారతి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
- ట్రాఫిక్ జాయింట్ సీపీ రవీందర్
ప్రపంచ తెలుగు మహాసభలు ఈ నెల 15 నుంచి 19 వరకు హైదరాబాద్ లో జరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ రవీందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టనున్నట్టు చెప్పారు. ఎల్బీ స్టేడియం, రవీంద్రభారతి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నామని, సభలకు హాజరయ్యేవారి వాహనాల పార్కింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
నిజాం కళాశాల మైదానంలో 1600 బస్సులను ఉంచేందుకు, వివిధ విద్యా సంస్థల మైదానాల్లో 5 వేల వాహనాలను పార్కింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మహాసభలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి హాజరయ్యే ముందు రోజు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, ఏఆర్ పెట్రోల్ బంకు నుంచి పీజేఆర్ విగ్రహం వరకు రహదారి మూసివేస్తామని రవీందర్ తెలిపారు.