వైసీపీ: పార్టీ ఫిరాయించిన గిడ్డి ఈశ్వరిపై అనర్హత వేటు వేయండి: వైసీపీ పిటిషన్
- ఏపీ అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీకి వైసీపీ ఎమ్మెల్యేల పిటిషన్
- పార్టీ ఫిరాయింపుదారులు 23 మందిపై అనర్హత వేటు వేయాలి
- చర్యలు తీసుకోవాలని కోరాం: ఆళ్ల రామకృష్ణారెడ్డి
వైసీపీ నుంచి టీడీపీలో చేరిన గిడ్డి ఈశ్వరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఏపీ అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీకి ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముస్తాఫాలు ఓ పిటిషన్ ను ఈరోజు సమర్పించారు. అనంతరం, ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, వైసీపీ గుర్తుపై గెలిచి పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ 23 మందిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పిటిషన్ సమర్పించామని, చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరామని అన్నారు.
పార్టీ ఫిరాయింపుదారులకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే స్వయంగా కండువాలు కప్పి వారిని ఆహ్వానిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అసలు రాజ్యాంగమే అమలు కావడం లేదని, అసెంబ్లీ స్పీకర్ ధృతరాష్ట్రుడిలా పాలిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ, ప్రతిపక్షపార్టీలను సమానంగా చూడాల్సిన స్పీకర్ కోడెల.. చంద్రబాబుకు తొత్తులా వ్యవహరిస్తున్నారని అన్నారు.