Chandrababu: గెలుస్తారని భావిస్తేనే టికెట్... మొహమాటం లేదన్న చంద్రబాబు మాటలతో నేతల్లో గుబులు!
- 40 అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి
- దగ్గరి వారైతే పిలిచి భోజనం పెడతా... టికెట్ మాత్రం ఆశించొద్దు
- పనిచేసే వారికి మాత్రమే పదవులు
- ప్రజల్లోకి వెళ్లి కష్టపడి మంచి పేరు తెచ్చుకోవాలని వార్నింగ్
తదుపరి ఎన్నికల్లో మొహమాటాలకు పోయి ఎవరికీ టికెట్లు ఇచ్చే పరిస్థితి తెచ్చుకోబోనని తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెగేసి చెప్పారు. నిన్న పార్టీ, ప్రభుత్వ సమన్వయ సమావేశంలో మాట్లాడిన ఆయన, ఇక పదవుల వద్ద సాన్నిహిత్యాన్ని చూడబోనని, సన్నిహితులని భావిస్తే, ఇంటికి పిలిచి అన్నం పెడతానే తప్ప, టికెట్లు ఆఫర్ చేయబోనని స్పష్టం చేశారు. ఇంట్లోనే కూర్చుని పదవులు అనుభవిస్తున్న వారికి ఇకపై పదవులు రావని, అందరినీ కలుపుకుని, పేరు తెచ్చుకుంటేనే పదవులు వరిస్తాయని అన్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి కేవలం పార్టీ ఇస్తున్న సమాచారంపై మాత్రమే ఆధారపడటం లేదని, తనకున్న వివిధ మార్గాల ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని దాన్ని సమీక్షిస్తున్నానని, దాని ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటానని వెల్లడించారు.
ఇక చంద్రబాబునాయుడి వ్యాఖ్యలు కొందరు తెలుగుదేశం నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఇప్పటివరకూ సిట్టింగ్ లకు గ్యారెంటీగా తిరిగి పోటీ చేసే అవకాశం లభిస్తుందని భావిస్తున్న వారంతా ఇప్పుడు మానసికాందోళనలో పడ్డట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో వైకాపా నుంచి ఫిరాయించిన ప్రతి ఎమ్మెల్యేకూ తదుపరి ఎన్నికల్లో చాన్స్ ఇస్తానని చంద్రబాబు నుంచి హామీ లభిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అదే జరిగితే, ఆయా నియోజకవర్గాల్లో తమ పరిస్థితి ఏంటని గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన టీడీపీ నేతలు తమ స్వరాన్ని ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నెమ్మది నెమ్మదిగా పెంచుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఇదిలావుండగా, ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమంతో ప్రభుత్వంపై విమర్శలు కొంత మేరకు తగ్గాయని, అయితే, ప్రస్తుతమున్న 54 శాతం ప్రజా సంతృప్త స్థాయిని డిసెంబర్ నాటికి 59 శాతానికి తీసుకెళ్లాలని చంద్రబాబు తన ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులకు సూచించారు. ముఖ్యంగా అగ్రిగోల్డ్ సమస్య, నిరుద్యోగ భృతి, ఫాతిమా కళాశాల విద్యార్థుల సమస్యలు, కడప స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టు వంటి వాటిని ఒక్కొక్కటిగా ఎన్నికల నాటికి పూర్తి చేద్దామని నిర్ణయించుకున్నట్టు ఆయన వెల్లడించారు.