చిరంజీవి: చిరంజీవి గారింట్లో ఆయనలా కష్టపడి పైకొచ్చిన వాళ్లు తక్కువ!: ఎమ్మెల్యే రోజా
- ఎన్టీఆర్, ఏఎన్నార్..టైమ్ లో చిరంజీవి వచ్చారు
- నెంబర్ వన్ స్థానానికి ఎదగడానికి చాలా కష్టపడ్డారు
- కేవలం చిరంజీవి చరిష్మాతో వాళ్లు వచ్చేస్తున్నారు: రోజా విమర్శ
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఆయనలా కష్టపడి పైకొచ్చిన వాళ్లు చాలా తక్కువని వైసీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి రోజా విమర్శించారు. ‘టీవీ 9’ నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో ఆమె ఫోన్ లైన్ లో మాట్లాడుతూ, ‘ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు గారు ఉన్న టైమ్ లో చిరంజీవి వచ్చారు. వీళ్లందరినీ కాదని చిరంజీవి నెంబర్ వన్ స్థానానికి ఎదగడానికి ఆయన చాలా కష్టపడ్డారు.
కానీ, ఆయన తమ్ముళ్లు, కొడుకు, మేనల్లుళ్లు, ఈరోజున ఆయన అల్లుడు గానీ..కేవలం చిరంజీవి గారి చరిష్మాతో వచ్చేస్తున్నారు. వీళ్లు కనుక చిరంజీవి గారి కుటుంబసభ్యులు కాకపోతే అవకాశాలు ఎవరిస్తారు? వాళ్లకు టాలెంట్ ఉందా? లేదా? అనే విషయం తర్వాత తెలుస్తుంది. పరిచయం కావడమనేదే చాలా ముఖ్యం’ అని రోజా అన్నారు. కాగా, ఈ చర్చా కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కూడా పాల్గొన్నారు.