రెండో వన్డే: రెండో వన్డే కూడా గెలుస్తామంటున్న శ్రీలంక కెప్టెన్
- భారత్-శ్రీలంక రెండో వన్డే రేపు మొహాలీలో
- రెండో వన్డేలో గెలిచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాం
- సిరీస్ ను కైవసం చేసుకుంటామన్న లంక కెప్టెన్ పెరీరా
భారత్ - శ్రీలంక మధ్య జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే. తొలి వన్డేలో ఘన విజయం సాధించిన శ్రీలంక జట్టు, రెండో వన్డేను కూడా కైవసం చేసుకుని మూడు వన్డేల సిరీస్ ను సొంతం చేసుకుంటామనే ధీమా వ్యక్తం చేస్తోంది. ఇరు జట్ల మధ్య రేపు జరగనున్న రెండో వన్డే మ్యాచ్ కు మొహాలీ స్టేడియం వేదిక కానుంది.
మొహాలీలో ప్రాక్టీస్ అనంతరం శ్రీలంక జట్టు కెప్టెన్ తిసారా పెరీరా మీడియాతో మాట్లాడుతూ, మూడు వన్డేల సిరీస్ ను తాము కైవసం చేసుకోవడానికి ఇదో మంచి అవకాశమని అన్నాడు. ధర్మశాల వన్డేలోలా తమ ఆటతీరుని కనబరిస్తే, సునాయాసంగా సిరీస్ ను దక్కించుకుంటామని అన్నారు. ఈ మ్యాచ్ ను కైవసం చేసుకునేందుకు తమ శాయశక్తులా ప్రయత్నిస్తామని అన్నాడు.
అయితే, భారత్ - న్యూజిలాండ్ మధ్య ఇటీవల జరిగిన సిరీస్ లో కూడా తొలి మ్యాచ్ ను టీమిండియా ఓడిపోయినప్పటికీ, మిగిలిన రెండు మ్యాచ్ లను గెలిచిన విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నామని, బాధ్యతగా ఆడి సిరీస్ కైవసం చేసుకునేందుకు కష్టపడతామని అన్నాడు.