దర్శకుడు రవిబాబు: అప్పుడు, విజయ్ సాయి తండ్రి తమ అబ్బాయికి మంచి పేరు పెట్టమని అడిగారు: దర్శకుడు రవిబాబు
- ఓ రోజు విజయ్ తో కలసి వాళ్ల నాన్న మా ఇంటికి వచ్చారు
- విజయ్ కి ఓ పేరు పెట్టమని అడిగారు
- నాటి విషయాన్ని ప్రస్తావించిన దర్శకుడు రవిబాబు
తొలి సినిమా అమ్మాయిలు-అబ్బాయిలు చిత్రం షూటింగ్ అయిన తర్వాత విజయ్ సాయి తండ్రి తన ఇంటికి వచ్చి, తన కొడుక్కి మంచి పేరు పెట్టాలని అడిగిన విషయాన్ని దర్శకుడు రవిబాబు గుర్తు చేసుకున్నారు. విజయ్ సాయి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మాట్లాడుతూ, ‘అమ్మాయిలు-అబ్బాయిలు చిత్రం షూటింగ్ అయిపోయిన తర్వాత ఓ రోజు ఉదయం విజయ్ ని తీసుకుని అతని తండ్రి మా ఇంటికి వచ్చారు.
‘మా అబ్బాయికి సినిమాల్లో బ్రేక్ ఇస్తున్నారు కదా, ఇతనికి మీరే ఓ పేరు పెట్టండి’ అని అన్నారు. ‘సార్.. నేను పేరు పెట్టడం ఏంటి! ఏదైనా చెత్తపేరు పెడితే.. అది జీవితాంతం ఉంటుంది’ అని అన్నాను. ‘మీరు, ఏ పేరు పెట్టినా ఓకే’ అని ఆయన అనడంతో, ‘అతని పేరు విజయ్ కాబట్టి.. మీకు ఇష్టమైన దేవుడి పేరు ఏదైనా కలిపి పెడదాం’ అని చెప్పాను. ‘విజయ్ సాయి’ అని పేరు పెట్టాను’ అని రవిబాబు ఆ విషయాన్ని ప్రస్తావించారు. విజయ్ సాయితో తన జ్ఞాపకాలు చాలా ఉన్నాయని, అతన్ని తాను మరచిపోలేనని చెప్పిన రవిబాబు, విజయ్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.