వైసీపీ అధినేత జగన్: మీ కొడుకుగా, మీ అన్నగా మహిళలందరికీ అండగా నిలుస్తా: వైసీపీ అధినేత జగన్
- నేను అధికారంలోకొస్తే డ్వాక్రా మహిళల రుణాలు తీరుస్తా
- జన్మభూమి కమిటీల పేరుతో దోచుకుంటున్న టీడీపీ మాఫియా
- ప్రజా సంకల్పయాత్రలో జగన్
‘మనందరి ప్రభుత్వం వస్తే మీ కొడుకు, మీ అన్నగా మహిళలందరికీ అండగా నిలుస్తా’ అని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా పాపంపేటలో జగన్ ప్రసంగిస్తూ, తాను అధికారంలోకి వస్తే, డ్వాక్రా మహిళలకు ఎన్నికల నాటికి ఎంత అప్పు ఉంటే అంత మొత్తాన్ని నాలుగు విడతల్లో నగదు రూపంలో చెల్లిస్తానని, ఎన్నికలైన మర్నాడే బ్యాంకులకు వెళ్లి అప్పు ఎంత ఉందో రిసీట్ తీసుకోండని, ఆ మొత్తాన్ని చెల్లిస్తానని అన్నారు.
గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ మాఫియా దోచుకుంటోందని, రేషన్ కార్డులు, పింఛన్లు చివరకు మరుగుదొడ్డి మంజూరుకు కూడా టీడీపీ మాఫియా లంచాలు తీసుకుంటోందని ఆరోపించారు. అనంతపురం జిల్లాలో రౌడీ మాఫియా రాజ్యమేలుతోందని, ఇలాంటి పరిస్థితులు మారాలని, రాజకీయాల్లోకి విశ్వసనీయత రావాలని అన్నారు. మాట ఇస్తే అమలు చేయాలని, లేకుంటే రాజీనామా చేయాలని చెప్పిన జగన్, అలాంటి పరిస్థితి రావాలంటే, తనకు ప్రజలు తోడుగా ఉండాలని అన్నారు.