సప్తగిరి: అందుకే, నా పేరును సప్తగిరిగా మార్చుకున్నా!: హాస్యనటుడు సప్తగిరి

  • నా అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్
  • నాడు తిరుమలలో జరిగిన సంఘటనతో పేరు మార్చుకున్నా
  • ఓ ఇంటర్వ్యూలో నాటి విషయాలను ప్రస్తావించిన సప్తగిరి

వెంకట ప్రభు ప్రసాద్ అనే తన పేరును సప్తగిరిగా మార్చుకున్నాక వంద శాతం విజయం సాధించానని ప్రముఖ హాస్యనటుడు సప్తగిరి అన్నాడు. తను హీరోగా నటించిన ‘సప్తగిరి ఎల్ఎల్ బి’ చిత్రం ఇటీవలే విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, సినీ పరిశ్రమలోకి వెళ్లాలనే ఆలోచన ఉన్న రోజుల్లో ఒకరోజు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన విషయాన్ని ప్రస్తావించాడు. స్వామి వారి దర్శనమైతే బాగా జరిగింది గానీ, తన ఆలోచనలు మాత్రం సానుకూలంగా లేవని చెప్పాడు.

తిరుమల మాడ వీధుల్లో సరదాగా తిరుగుతూ, ఆలయాన్ని చూస్తూ ఓ చోట నిలబడ్డానని, ఓ వ్యక్తి ఉన్నపళంగా నా వెనుక నుంచి వచ్చి ‘నాన్నా సప్తగిరీ, పక్కకు జరుగు’ అన్నాడని నాటి సంఘటనను గుర్తుచేసుకున్నాడు. తనను ఆ పేరుతో పిలిచింది ఎవరా అనుకుంటా వెనక్కి తిరిగి చూశానని, కాషాయ వస్త్రాలు ధరించిన ఆయన చినజీయర్ స్వామి వారిలా అనిపించారని, ఆయన్ని చూడగానే తనలో ఒకరకమైన సంతోషం కలిగిందని, వైబ్రేషన్స్ వచ్చాయని  చెప్పాడు.

అలాంటి వేషధారణలోనే నలభై మంది సాధువులు కనిపించారని.. తనను దాటుకుంటూ వెళుతున్న వాళ్లల్లో చాలామంది చిరునవ్వులు చిందించారని, ఆ సన్నివేశం తనలో తెలియని సంతోషాన్ని ఇచ్చిందని చెప్పాడు. అప్పటి నుంచి తన పేరును సప్తగిరిగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నానని అన్నాడు. తిరుమలలో ఈ సంఘటన జరిగిన పదిహేను రోజుల్లోనే తాను హైదరాబాద్ కు రావడం జరిగిందని సప్తగిరి చెప్పాడు.

  • Loading...

More Telugu News