అమర్ నాథ్ రెడ్డి: ఆ గడ్డమాయన కుప్పానికి, ఈ మీసాలాయన పలమనేరుకు చేసింది శూన్యం!: వైసీపీ నేత రోజా
- టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి అమర్ నాథ్ రెడ్డిపై విమర్శలు
- ఇద్దరూ కలిసి చిత్తూరు జిల్లాకు ఏం చేశారు?
- చంద్రబాబుకు, లోకేశ్ కు రబ్బరు స్టాంప్ అమర్ నాథ్ రెడ్డి
వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన పలమనేరు ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డిపై ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. ‘జగన్ పై ప్రేమతో, వైఎస్ రాజశేఖరరెడ్డిపై అభిమానంతో ప్రజలందరూ అమర్ నాథ్ రెడ్డిని గెలిపించారు. ఆ నమ్మకాలను వమ్ము చేసి తన లాభం కోసం, మిమ్మల్ని వెన్నుపోటు పొడిచి, తన స్వలాభం కోసం, మంత్రి పదవి కోసం సిగ్గులేకుండా టీడీపీలోకి వెళ్లిపోయారు. ఎప్పుడు చూసినా టీవీలో ఆయన మీసాలు తిప్పుతూ కనబడతారు తప్పా, పలమనేరుకు కానీ, చిత్తూరు జిల్లాకు కానీ ఆయన చేసింది శూన్యం.
ఇక ఆ గడ్డమాయనకు ఈ మీసాలాయన తోడయ్యాడు. ఆ గడ్డం ఆయన కుప్పానికి ఏం చేయడు, ఈ మీసాలు ఆయన పలమనేరుకు ఏమీ చేయడు. ఇద్దరూ కలిసి చిత్తూరు జిల్లాకు ఏమీ చెయ్యరు. చిత్తూరు జిల్లాకు చెందిన మనిషి ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పుకోవడం తప్పా, ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఒక్క ప్రాజెక్ట్ గానీ, పరిశ్రమను గానీ తీసుకురాలేదు.
ఒకటి మాత్రం అర్థమవుతుంది.. పేపరు మీద మాత్రమే అమర్ నాథ్ రెడ్డి మంత్రి. చంద్రబాబునాయుడుకు, లోకేశ్ కు ఓ రబ్బరు స్టాంపులా ఉన్నాడే తప్పా, స్వతహాగా నిర్ణయం తీసుకునే అవకాశం ఆయనకు ఇవ్వలేదు. ఎందుకంటే, చిత్తూరు జిల్లాలో మూసేసిన షుగర్ ఫ్యాక్టరీలు తెరవలేకపోయారంటే అమర్ నాథ్ రెడ్డి చేతిలో పవర్ లేదని అర్థమవుతోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 1వ ర్యాంకులో ఉన్న ఏపీ, అమర్ నాథ్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి అయిన తర్వాత 14వ స్థానానికి పడిపోయింది’ అని రోజా విమర్శించారు.