ప్రపంచ తెలుగు మహాసభలు: 15 నుంచి హైదరాబాదులో ప్రపంచ తెలుగు మహాసభలు.. చురుగ్గా ఏర్పాట్లు!
- ప్రారంభోత్సవ కార్యక్రమంలో 40 వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు
- హైదరాబాద్ లో ఐదురోజుల పాటు తెలుగు మహాసభలు
- ఎల్బీ స్టేడియం వేదికగా ప్రారంభోత్సవ కార్యక్రమం
ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ లో ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు ఐదురోజుల పాటు తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఎల్బీ స్టేడియం వేదికగా ఈ నెల15వ తేదీ సాయంత్రం తెలుగు మహాసభల ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా, గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు అతిథులుగా హాజరుకానున్నారు. ప్రధాన వేదికను అతిథులతో పాటు సీఎం కేసీఆర్, ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ తదితరులు అలంకరించనున్నారు.
అద్భుతమైన ఏర్పాట్లు
ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో దాదాపు 40 వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకల ముగింపు కార్యక్రమానికి భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హాజరుకానున్నారు. తెలుగు మహాసభల సందర్భంగా స్టేడియంలో చేస్తున్న ఏర్పాట్ల గురించి చెప్పాలంటే..
* మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు .. తదితర ప్రముఖులు వంద మంది కూర్చునేందుకు వీలుగా ప్రత్యేక గ్యాలరీ
* రెండు వందల మంది కవులు, పండితులకు మరో గ్యాలరీ
* మూడు వందల మంది విదేశీ అతిథులు, ఇతర రాష్ట్రాల అతిథుల కోసం ఇంకో గ్యాలరీ
* 120 మంది ప్రత్యేక ఆహ్వానితుల కోసం, ఏడువేల మంది ప్రతినిధుల కోసం వేర్వేరు గ్యాలరీలు
* సాధారణ సందర్శకులు 30 వేల మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు
* స్డేడియంలోకి రాకపోకలు సాగించేందుకు ప్రముఖుల కోసం మూడు ద్వారాలు
* ప్రతినిధుల కోసం మరో మూడు ద్వారాలు
* సాధారణ సందర్శకుల కోసం ఎనిమిది ద్వారాలు
* స్టేడియం ప్రాంగణంలో ఉన్న స్తంభాలకు తెలంగాణ కవులు, చరిత్రకారులు, రచయితలు,
వైతాళికుల చిత్రాలు
* స్టేడియంలో ఎల్ఈడీ ఎలక్ట్రానిక్ తెరలు
* మహాసభల ప్రారంభోత్సవం రోజున బెలూన్ల ఎగురవేత, బాణసంచా వెలుగులు.. లేజర్ షో
కూడా ఉంటుంది
* భారతీయ పురావస్తు, చేనేత, సాంస్కృతిక, హస్తకళలతో పాటు ఇతర శాఖలకు చెందిన
ఎనిమిది ప్రదర్శనశాలల ఏర్పాటు.