పవన్ కల్యాణ్: ప్రజలు ఆనందంగా లేనప్పుడు ఎంత పెద్ద రాజధాని కట్టినా వృథానే!: పవన్ కల్యాణ్
- డబ్బులు లేనప్పుడు ఆడంబరాలకు వెళ్లకూడదు
- ఏపీలో పార్టీ ఆఫీస్ పెడుతున్నా..అన్ని సమస్యలపై పోరాడతా
- మంగళగిరిలో పార్టీ ఆఫీసుకు స్థలాన్ని పరిశీలించిన పవన్
డబ్బులు లేనప్పుడు ఆడంబరాలకు వెళ్లకూడదని, ప్రజలు ఆనందంగా లేనప్పుడు ఎంత పెద్ద రాజధాని కట్టినా వృథానే అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. విజయవాడ పర్యటనలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ‘జనసేన’ పార్టీ ఆఫీసు ఏర్పాటు నిమిత్తం స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, ఏపీలో పార్టీ ఆఫీస్ పెడుతున్నానని, అన్ని సమస్యలపై పోరాడతానని అన్నారు.
సమస్యలను అర్థం చేసుకునే వ్యక్తి కాబట్టే చంద్రబాబుకు సపోర్ట్ చేశానని, చెప్పిన సమస్యలు విని పరిష్కరించే వ్యక్తి ఆయన అని ప్రశంసించారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుండటం వల్లే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం లేదని, దానిని తన చేతగాని తనంగా భావించొద్దని అన్నారు. తాను చాలా నిగ్రహంగా రాజకీయాలు చేస్తున్నానని, పదునైన, బలమైన రాజకీయాలు కూడా చేయగలనని అన్నారు. తాను చేసే పనులు కొన్నిసార్లు ప్రభుత్వానికి మద్దతుగా, మరికొన్నిసార్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటాయని అన్నారు.