రాజంపేట: వెంటాడుతున్న బంధం: ప్రేమతో పెంచుకున్న కుక్క కోసం ఓ కుటుంబం వెతుకులాట!

  • వీధి కుక్కను పెంచుకున్న రాజంపేటకు కు చెందిన ఓ కుటుంబం
  • అభ్యంతరం వ్యక్తం చేసిన పొరుగువారు
  • హైదరాబాద్ బ్లూ క్రాస్ లో వదిలేద్దామనుకుంటే కుదర్లేదు
  • రోడ్డుపై విడిచిపెట్టి.. తిరిగి దానిని వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చిన కుటుంబం! 

అది వీధి కుక్కే అయినా, దానిని పెంపుడు జంతువుగా చేసుకున్నారు. తొమ్మిదేళ్లు ప్రేమగా చూసుకున్నారు. విధి లేక దానిని వదిలేయాల్సిన పరిస్థితి వస్తే.. ఆ కుటుంబం వెక్కి వెక్కి ఏడ్చింది. దానిపై దిగులు పడి పోయి, మెతుకు ముట్టలేదు. ఈ ఆసక్తికర సంఘటన గురించి చెప్పాలంటే.. కడప జిల్లా రాజంపేటకు చెందిన గంగేశ్వర్ రావు బస్ కండక్టరు. ఓ వీధి కుక్కను తొమ్మిదేళ్లుగా పెంచుకుంటున్నారు. దానిని ‘సాయి’ అని ప్రేమతో పిలిచేవారు.

అయితే, గంగేశ్వర్ రావు ఇంట్లో కుక్క ఉండటంపై పొరుగు వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో, హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని బ్లూ క్రాస్ లో ‘సాయి’ ని వదిలేయాలని వారి కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఓ కారును కిరాయికి మాట్లాడుకుని, ‘సాయి’ని తీసుకుని ఆయన బ్లూ క్రాస్ కు వెళ్లాడు. ‘వీధి కుక్కలను తీసుకోం’ అనే సమాధానం అక్కడి వారు చెప్పడంతో.. తిరిగి రాజంపేటకు ‘సాయి’ని తీసుకువెళ్లలేకపోయాడు.

దీంతో, జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 36లో వదిలేసి వెళ్లిపోయాడు. అయితే, ‘సాయి’ని బ్లూక్రాస్ లో వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నప్పటి నుంచి గంగేశ్వర్ రావు భార్య, ఇద్దరు కుమార్తెలు తిండి తింటే ఒట్టు! పైగా, ‘సాయి’ని రోడ్డుపక్కన వదిలేసిన విషయం తెలిసి మరింతగా వారు కుమిలిపోయారు. ఆ బాధను జీర్ణించుకోలేకపోయిన గంగేశ్వర్ రావు కుటుంబసభ్యులు.. బుధవారం రాత్రి కిరాయి కారులో అక్కడి నుంచి బయలుదేరి నిన్న హైదరాబాదు, జూబ్లీహిల్స్ కు వచ్చారు.

‘సాయి’ని ఎక్కడైతే వదిలేశారో అక్కడ, పరిసర ప్రాంతాల్లో గాలించారు. దాని ఆచూకీ తెలియకపోవడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ ల ఆధారంగా ‘సాయి’ ఆచూకీ దొరుకుతుందేమోనని పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News