జనసేన’: ఎవరు బెదిరించినా భయపడొద్దు..‘జనసేన’ అండగా ఉంటుంది: ‘ఫాతిమా’ విద్యార్థులతో పవన్ కల్యాణ్
- తప్పు చేయని విద్యార్థులకు శిక్ష వేయడం సరికాదు
- వారి భవిష్యత్ నాశనమవుతుంటే చూస్తూ ఊరుకోను
- వారం రోజుల్లో తప్పనిసరిగా న్యాయం చేస్తాను: పవన్ హామీ
'మిమ్మల్ని ఎవరు బెదిరించినా భయపడొద్దు.. ‘జనసేన’ మీకు అండగా ఉంటుంది' అని ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులకు పవన్ భరోసా ఇచ్చారు. విజయవాడలో పర్యటిస్తున్న పవన్ ని ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులు కలిసి తమ ఆవేదనను, బాధలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, తప్పు చేయని విద్యార్థులకు శిక్ష వేయడం సరికాదని, కళాశాల యాజమాన్యం చేసిన తప్పులకు విద్యార్థులకు శిక్ష వేస్తారా? అని ప్రశ్నించారు.
విద్యార్థుల సమస్యలపై మంత్రి కామినేనితో మాట్లాడతానని, విద్యార్థులకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని అన్నారు. విద్యార్థుల భవిష్యత్ నాశనమవుతుంటే చూస్తూ ఊరుకోనని, అవసరమైతే, విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించేందుకైనా తాను వెనుకాడనని అన్నారు. వారం రోజుల్లో తప్పనిసరిగా న్యాయం చేస్తానని బాధిత విద్యార్థులకు పవన్ హామీ ఇచ్చారు. విద్యార్థులే దేశ సంపద అని, ఫాతిమా కళాశాల విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ తన పోరాటం కొనసాగుతుందని అన్నారు.