పవన్ కల్యాణ్: పవన్ కల్యాణ్ ముందు వాపోయిన ఫాతిమా వైద్యకళాశాల విద్యార్థులు!

  • విజయవాడలో పర్యటించిన పవన్ కల్యాణ్
  •  సీట్లు మాత్రమే అడుగుతున్నాం, ఫీజులు కాదన్న బాధిత విద్యార్థులు
  • జనసేన అధినేత ముందు ఆవేదన వ్యక్తం చేసిన వైనం

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు విజయవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆయన్ని కలిశారు. తమ ఆవేదనను పవన్ ముందు వ్యక్తం చేశారు. ఫాతిమా కళాశాలపై చర్యల విషయంలో ప్రభుత్వం వెనుకాడుతోందని, ఆరు నెలలుగా తాము రోడ్లపై తిరుగుతున్నామని వాపోయారు. మరో నెల రోజుల్లో పరీక్షలు ఉన్న సమయంలో తమ ప్రవేశాలు రద్దు చేశారని చెప్పారు. తాము సీట్లు మాత్రమే అడుగుతున్నామని, ఫీజులు కాదని స్పష్టం చేశారు.

కళాశాల యాజమాన్యం తమను మోసం చేసిందని, అందరిచుట్టూ తిరుగుతున్నా తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వేరే కళాశాలల్లో సీటు ఇస్తామని నంద్యాల ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని, మళ్లీ ఇప్పుడు లాంగ్ టర్మ్ కోచింగ్ కు పంపిస్తామని ప్రభుత్వం చెబుతోందని, మళ్లీ ర్యాంకు వచ్చి తమకు సీటు వస్తుందనే గ్యారంటీ ఏమిటని విద్యార్థులు ప్రశ్నించారు. ఫాతిమా కళాశాలకు తాము చెల్లించిన డబ్బులు తిరిగి ఇప్పిస్తామని ప్రభుత్వం చెప్పడం దారుణమని, మంత్రి కామినేని తమకు సరైన సమాధానం ఇవ్వలేదని విద్యార్థులు ఆరోపించారు. కాగా, పెన్షన్ స్కీం ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు కూడా తమ సమస్యలను పవన్ కల్యాణ్ కు విన్నవించారు.

  • Loading...

More Telugu News