పవన్ ఫ్యాన్స్: అప్పుడు పవన్ ఫ్యాన్స్ నా వెంట పడ్డారు.. ఇప్పుడు పవన్ వెంట నేను పడుతున్నాను!: మహేశ్ కత్తి
- నాపై అప్రజాస్వామికమైన దాడి చేస్తే నేను సైలెంట్ గా ఉన్నాను
- ‘అజ్ఞానవాసి’ అని నేను అనడం వ్యక్తిగత విమర్శకాదు
- ఆయన అజ్ఞానం గురించే నేను మాట్లాడుతున్నా: మహేశ్ కత్తి
పవన్ ఫ్యాన్స్ తన వెంట పడ్డారని, ఇప్పుడు, పవన్ వెంట తాను పడుతున్నానని ఫిల్మ్ క్రిటిక్ మహేశ్ కత్తి అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ లో ఆయన మాట్లాడుతూ, ‘‘కాటమరాయుడు’ సినిమా అప్పుడు నేను మాట్లాడితే, పవన్ ఫ్యాన్స్ నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ‘మా దేవుడిని అంటావా?’ అంటూ పవన్ ఫ్యాన్స్ నన్ను విమర్శించారు. నేను ప్రజాస్వామ్యంలో ఉన్నా. రాజ్యాంగబద్ధంగా బతుకుతున్నా. ఒక వ్యక్తిని దేవుడిని చేసేంత మూర్ఖత్వం నాలో లేదు. ఇలాంటి మూర్ఖత్వాన్ని నేను సహించను.
నా మీద అప్రజాస్వామికమైన దాడి చేస్తే నేను సైలెంట్ గా ఉన్నాను. అందుకనే, నేను ఇప్పుడు పవన్ కల్యాణ్ ని సహేతుకంగా, రాజ్యాంగబద్ధంగా ప్రశ్నిస్తూనే ఉంటాను. ‘అజ్ఞాతవాసి’ని ‘అజ్ఞానవాసి’ అని నేను అనడం వ్యక్తిగత విమర్శకాదు. ఆయన అజ్ఞానం గురించే నేను మాట్లాడుతున్నాను. అతను అజ్ఞాని కాదా? మేధావితనంతో మాట్లాడుతున్నాడా? ఏ విషయంలోనూ ఆయన మేధావితనంతో మాట్లాడలేదు. చర్చకు రమ్మనమనండి..అతని మేధావితనం ఏంటో నాకూ తెలుస్తుంది’ అని మహేశ్ కత్తి అన్నారు.