దర్శకుడు గౌతమ్ మేనన్: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ కు స్వల్ప గాయాలు
- ఈరోజు తెల్లవారు జామున చెన్నైలో రోడ్డు ప్రమాదం
- ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టిన లారీ..
- గౌతమ్ మీనన్ కు స్వల్పగాయాలు.. ఆసుపత్రికి తరలించి చికిత్స
చెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ గాయపడ్డారు. చెన్నై నుంచి మహాబలిపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈస్ట్ కోస్ట్ రోడ్డులో గురువారం తెల్లవారుజామున ఆయన ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో కారు బాగా దెబ్బతింది. కాగా, తమిళం, తెలుగు భాషలలో పలు చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. తెలుగులో ‘ఘర్షణ’, ‘ఏ మాయ చేశావే’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘సాహసమే శ్వాసగా సాగిపో’ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ప్రస్తుతం హీరో విక్రమ్ తో ‘ధ్రువ నక్షత్రం’తో పాటు, సందీప్ కిషన్ హీరోగా తమిళంలో ‘నరగసూరన్’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో ‘నరకాసురుడు’గా విడుదల కానుంది.