శశికపూర్: నేను మీ నాన్నకు అభిమానిని... శశికపూర్ కుమార్తెకు లేఖ రాసిన సోనియా గాంధీ
- నా అభిమాన నటుడు శశికపూర్
- ఆయన గొప్ప నటుడు
- శశికపూర్ సినిమాకు రాజీవ్ నన్ను తీసుకువెళ్లారు: సోనియా
బాలీవుడ్ నటుడు శశికపూర్ కి తాను వీరాభిమానినని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. కొంతకాలం పాటు అనారోగ్యంతో బాధపడిన శశికపూర్ మూడు రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శశికపూర్ కుమార్తె సంజనాకపూర్ కి ఆమె లేఖ రాశారు. శశికపూర్ మృతి వార్త తెలిసి చాలా బాధపడ్డానని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
శశికపూర్ నటించిన ఆంగ్ల చిత్రం ‘షేక్ స్పియర్ వాలా’ చూసి ఆయనకు అభిమానిగా మారానని, 1966లో ఇంగ్లాండ్ లో రాజీవ్ గాంధీ తనను ఈ సినిమాకు తీసుకువెళ్లారని ఆ లేఖలో ఆమె పేర్కొన్నారు. ఆ సినిమా చూడటం మర్చిపోలేని అనుభవంగా ఆమె అభివర్ణించారు. శశికపూర్ నటించిన పలు చిత్రాలు చూశానని, ఆయన గొప్పనటుడని, ఎలాంటి పాత్రల్లోనైనా గొప్పగా నటిస్తారని, కష్టపడి పని చేసే వ్యక్తి అని ఆమె ప్రశంసించారు.