చంద్రబాబు: చంద్రబాబు మొఖం చూసో, నా ముఖం చూసో ఉద్యోగాలు రావు: జగన్
- ఏపీకి ప్రత్యేక హోదా రాకపోతే యువతకు ఉద్యోగాలు రావు
- ప్రత్యేక హోదా సంజీవని అని చెప్పిన బాబు మాట మార్చారు
- ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు: జగన్
ఏపీకి ప్రత్యేక హోదా రాకపోతే చంద్రబాబు మొఖం చూసో, తన ముఖం చూసో యువతకు ఉద్యోగాలు ఇవ్వరని వైసీపీ అధినేత జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘సాక్షి’ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. ఓ ఫ్యాక్టరీ కట్టాలన్నా, ఓ హోటలు కట్టాలన్నా, హాస్పిటల్ కట్టాలన్నా ఇన్ కం ట్యాక్స్, జీఎస్టీ చెల్లించాల్సిన పని లేదంటేనే పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు.
అంతేగానీ, చంద్రబాబు ఫేస్ బాగుందనో, జగన్ ఫేస్ బాగుందనో వారు ముందుకు రారు. ప్రత్యేక హోదా సౌకర్యం వుంటే వారు ముందుకు వస్తారు. ప్రత్యేక హోదా సంజీవని అని, ప్రత్యేక హోదా పదేళ్లు, పదిహేనేళ్లు కావాలని నాడు చంద్రబాబు నాయుడే అన్నారు. అటువంటి వ్యక్తి ఈరోజు మాట మార్చేసి ప్రజలను మోసం చేస్తున్నారు. టౌన్లలో ఉన్న ప్రజలకు ఈ విషయం బాగా అర్థమవుతుంది’ అని చెప్పుకొచ్చారు.