జగన్: చంద్రబాబునాయుడు గారే దళారీగా మారారు!: జగన్ మండిపాటు
- నా పాదయాత్రలో రైతులు చెప్పే మాటలు విని ఆశ్చర్యపోతున్నా
- నాలుగేళ్లలో ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేవు
- ఓ ఇంటర్వ్యూలో వైసీపీ అధినేత జగన్
ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేవని మూడు జిల్లాల్లో రైతులు చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయానని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ‘సాక్షి’ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘రైతు దగ్గర కిలో టమోటాలను రెండు రూపాయలకో మూడు రూపాయలకో కొంటున్నారు. అవే టమోటాలను ఏ హెరిటేజ్ కు దళారీలు అమ్మితే కిలో టమోటాలు నలభై రూపాయలు. ఇలాంటి విషయాలు చంద్రబాబునాయుడుకి తెలియక కాదు. చంద్రబాబునాయుడు గారే దళారీగా మారి..దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారు.
రైతులకు ఈ విషయం తెలిసినా తమ కర్మ అని, ప్రభుత్వ వైఫల్యమని సరిపెట్టుకుంటున్నారు. సుమారు నాలుగేళ్లలో పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర లేదు! శ్రీశైలంలో నీళ్లు కనిపిస్తూ ఉంటాయి కానీ, రాయలసీమలో ఏ ప్రాజెక్టూ పూర్తి కాలేదు! అన్ని వర్గాల వారిని చంద్రబాబునాయుడు మోసం చేశారు. ఏ వర్గాన్ని వదిలిపెట్టలేదు.
ఇంతకుముందు రైతులకు, మహిళలకు సున్న లేదా పావలా వడ్డీకే బ్యాంకు రుణాలు అందేవి. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాకా వడ్డీ డబ్బులను బ్యాంకులకు కట్టడం మానేశారు. చంద్రబాబు చేసిన పెద్దతప్పుల్లో ఇది ఒకటి. ఉపాధి హామీ పనులు సవ్యంగా జరగట్లేదు. మా నాయన హయాంలో.. కూలీలకు వేతనంగా 97 శాతం నిధులు వెళ్లేవి. ఇలాంటి విషయాలను ప్రజలు చెబుతున్నారు కాబట్టే నాకు తెలుస్తున్నాయి’ అని జగన్ చెప్పుకొచ్చారు.