‘పోలవరం’: రేపు పోలవరానికి వైసీపీ బస్సు యాత్ర!

  • విజయవాడ నుంచి బయలుదేరనున్న  వైసీీపీ నేతల బృందం
  • ‘పోలవరం’ పనులను పరిశీలిస్తాం
  • మీడియా సమావేశంలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

పోలవరం ప్రాజెక్ట్ ను పరిశీలించేందుకు వైసీపీ నేతల బృందం రేపు అక్కడికి వెళ్లనుంది. ఆ పార్టీ నేతలు విజయవాడ నుంచి బస్సుల్లో రేపు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ విషయాన్ని వైసీపీ నేత, ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్రకార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘పోలవరం’ ప్రాజెక్టు పనులను పరిశీలిస్తామని చెప్పారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ దాని పనులు వేగవంతంగా జరగడం లేదని,నిర్మాణంలో ఇబ్బందులు ఎందుకు తలెత్తుతున్నాయని ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు కోసం నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో కృషి చేశారని, ఆయన చొరవ వల్లే అన్ని అనుమతులు వచ్చాయని, కుడి, ఎడమ కాల్వల నిర్మాణాన్ని 80 శాతం వరకు వైఎస్సారే పూర్తి చేశారని అన్నారు.

కానీ, చంద్రబాబు మాట మారుస్తూ ఒక పథకం ప్రకారం ‘పోలవరం’ నిర్మాణానికి సమాధి కట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. సర్కారు తీరు చూస్తుంటే 2019 నాటికి కూడా ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలా లేదని, కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకుని ప్రాజెక్ట్ ను నిర్మించకుండా వదిలేసేందుకు ఇప్పుడు కుట్రలు పన్నుతున్నారని, పనులు జరగకపోవడానికి కారణం సీఎం చంద్రబాబేనని, కమీషన్ల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని, ప్రాజెక్టు వ్యయాన్ని భారీగా పెంచేశారని ఆరోపించారు. చంద్రబాబు దుర్మార్గపు వైఖరిని ప్రజలకు చూపించాలనే ఉద్దేశ్యంతోనే పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించేందుకు వెళ్తున్నామని అన్నారు. 

  • Loading...

More Telugu News