హైదరాబాద్: ప్రేమ పేరిట మోసం... యువ వైద్యురాలు ఆత్మహత్య!
- హైదరాబాద్ లోని చైతన్యపురిలో సంఘటన
- గదిలోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య
- ఆత్మహత్యకు ముందు తన కుటుంబసభ్యులకు ఫోన్ చేసిన వైద్యురాలు
ప్రేమ పేరుతో మోసపోయిన ఓ యువ వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన హైదరాబాద్ లోని చైతన్యపురిలో జరిగింది. అక్కడి ఓ హాస్టల్ లో గీతాకృష్ణ అనే డెంటిస్టు ఉంటోంది. నరేశ్ అనే యువకుడితో ఆమె ప్రేమలో పడినట్టు తెలుస్తోంది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నరేశ్ నమ్మించి మోసం చేయడంతో మానసికంగా కుంగిపోయిన గీతాకృష్ణ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.
హాస్టల్ లోని తన గదిలోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఆత్మహత్యకు పాల్పడే ముందు ఆమె తన కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడిందని, తనకు జరిగిన అన్యాయాన్ని వారికి చెప్పినట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. గీతాకృష్ణ ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు జగిత్యాల జిల్లాకు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది.