కోదండరామ్: కోదండరామ్ పై విమర్శలు గుప్పించిన టీఆర్ఎస్ నేతలు!

  • ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టులు ఆగవు
  • కోదండరామ్ కు దమ్ముంటే పార్టీ పెట్టాలి 
  • ప్రజల కోసం పని చేస్తున్న కేసీఆర్ కుటుంబం
  •  టీఆర్ఎస్ నేతల విమర్శలు   

టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ పై టీఆర్ఎస్ నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, బాల్క సుమన్ విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. కొలువుల కొట్లాట సభకు ప్రజల నుంచి స్పందన లేదని, కోదండరామ్ కు దమ్ముంటే  పార్టీ పెట్టి తమతో పోటీ పడాలని  ప్రభుత్వ చీఫ్ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి సవాల్ విసిరారు.

కాంగ్రెస్ పార్టీ, కోదండరామ్ లు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రభుత్వ ప్రాజెక్టులు ఆగవని అన్నారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థి మురళి ఆత్మహత్య సంఘటనపై ఆయన స్పందించారు. ఈ సంఘటన చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, ఈ సంఘటనను రాజకీయం చేయడం సబబుకాదని అన్నారు. మురళి సూసైడ్ నోట్ పై కోదండరామ్ అనుమానాలు వ్యక్తం చేయడం బాధాకరమని అన్నారు.

బాల్క సుమన్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ కుటుంబం ప్రజల కోసం పని చేస్తోందని, తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నారని అన్నారు. ప్రజాతీర్పుతో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారే తప్పా, ఆయన్ని ఎవరూ నామినేట్ చేయలేదని, టీజేఏసీ చైర్మన్ గా కోదండరామ్ ను నాడు నామినేట్ చేసింది కేసీఆరేనని అన్నారు. నిరుద్యోగుల సమస్యలపై పోరాడాల్సిన కోదండరామ్ తన కొలువు కోసం చూసుకుంటున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆదరణను చూసి విపక్షాలు సహించలేకపోతున్నాయని బాల్క సుమన్ విమర్శించారు.

  • Loading...

More Telugu News