jagan: కొన్ని పేపర్లు, టీవీలు చంద్రబాబుకు మద్దతుగా ఉన్నాయి: జగన్
- నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో సంతోషంగా ఉన్నారా?
- చట్టాలు చేయాల్సిన చట్టసభల్లోనే ఎమ్మెల్యేలను కొంటున్నారు
- ఎమ్మెల్యేలు పార్టీ మారితే వారు రాజీనామా చేయాలి
- 20 నుంచి 30 కోట్ల రూపాయల వరకు ఇచ్చి కొంటున్నారు
'నాలుగేళ్ల చంద్రబాబు నాయుడి పాలనలో సంతోషంగా ఉన్నారా?' అని అడుగుతున్నానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజలనుద్దేశించి అన్నారు. నాలుగేళ్ల అసమర్థ పరిపాలన చూశాక మరోసారి ఇటువంటి నాయకుడిని ఎన్నుకుంటారా? అని ప్రశ్నించారు. పాదయాత్ర చేస్తోన్న జగన్.. కర్నూలు జిల్లా పత్తికొండ ఊరువాకిలి సెంటర్లో ఈ రోజు మాట్లాడుతూ... మనకు ఎలాంటి నాయకుడు కావాలని మన మనసాక్షిని అడగాలని హితవు పలికారు. 'మోసం చేసేవాడు నాయకుడిగా కావాలా? అందరూ చేతులు ఊపుతూ చెప్పండి.. అసత్యాలు చెప్పే నాయకుడు కావాలా? నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో సంతోషంగా ఉన్నారా?' అని జగన్ ప్రజలను అడిగారు.
'బొగ్గు నుంచి మద్యం, రాజధాని భూముల వరకు చివరకు గుడి భూములను కూడా వదిలి పెట్టడం లేదు.. ఇటువంటి అవినీతి నాయకుడు మీకు కావాలా? నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూశాం, ఇదే కనిపించింది.. ఉన్నది లేనట్లుగా చూపిస్తారు, లేనిది ఉన్నట్లుగా చూపిస్తున్నారు. కొన్ని పేపర్లు, టీవీలు చంద్రబాబుకు మద్దతుగా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో చట్టం లేదు. చట్టాలు చేయాల్సిన చట్టసభల్లోనే పశువులను కొన్నట్లు ఎమ్మెల్యేలను కొంటున్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారితే వారు రాజీనామా చేయాలి. వారు చేయడం లేదు. చట్ట సభల్లో చంద్రబాబు నాయుడు 20 నుంచి 30 కోట్ల రూపాయల వరకు ఇచ్చి ఎమ్మెల్యేలను కొంటున్నారు' అని జగన్ వ్యాఖ్యానించారు.
'ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఆడియో టేప్లతో పాటు దొరికిపోయినా ఆ ముఖ్యమంత్రి రాజీనామా చేయడం లేదు. ఇటువంటి దారుణ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని నడుపుతున్నారు.. గ్రామాల్లో ఈ రోజు ఏది కావాలన్నా లంచం ఇవ్వాల్సిందే.. ఇసుక నుంచి అన్నింటినీ దోచేస్తున్నారు' అని జగన్ అన్నారు.