Tamilnadu: పబ్లిసిటీ కోసమే కమల్ ఇలా చేస్తున్నారు: తమిళనాడు మంత్రి జయకుమార్

- రాజకీయాల్లోకి రావాలనుకుంటోన్న సినీనటుడు కమల హాసన్
- తరుచూ తమిళనాడు సర్కారుపై అవినీతి ఆరోపణలు
- ఎటువంటి ఆధారాలూ లేకుండా కమల్ ఆరోపణలు చేస్తున్నారు-జయకుమార్
- మానుకోకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం
రాజకీయాల్లోకి రావాలనుకుంటోన్న సినీనటుడు కమల హాసన్ తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తోన్న విషయం తెలిసిందే. తమిళనాడు సర్కారుపై ఆయన అనేక అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా కమల్ ఓ ట్వీట్ చేస్తూ దోపిడీలో ప్రభుత్వమే జోక్యం చేసుకోవడం నేరమని, నేరగాళ్లు దేశాన్ని పాలించకూడదని, పనిచేయడం కోసమే ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకున్నారని అన్నారు. ప్రజలు చైతన్యవంతులు కావాలని అన్నారు.
కమల్ తీరుపై స్పందించిన తమిళనాడు మంత్రి జయకుమార్... కమల్ ఎటువంటి ఆధారాలూ లేకుండా తమ సర్కారుపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల్ ఇటువంటి ఆరోపణలు చేయడం మానుకోకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని, పబ్లిసిటీ కోసమే ఆయన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.