టీఆర్ఎస్: భార్యను హింసించిన టీఆర్ఎస్ యువజన నేత అరెస్టు!
- యువజన విభాగం నేత శ్రీనివాస్ అరెస్టు
- ఇప్పటికే ఒక పెళ్లయి విడాకులు..రెండో భార్యగా సంగీత
- మరో అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చిన శ్రీనివాస్
- పోలీసుల దర్యాప్తులో తేలినట్టు తెలుస్తోంది
భార్య సంగీతను హింసించిన టీఆర్ఎస్ యువజన విభాగం నేత శ్రీనివాస్ ను పోలీసులు అరెస్టు చేశారు. రెండేళ్ల క్రితం వారికి ఆడపిల్ల పుట్టింది. అప్పటి నుంచి సంగీతను దుర్భాషలాడుతూ వేధింపులకు పాల్పడుతూనే ఉన్నాడు. అంతే కాకుండా, మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురావడాన్ని ప్రశ్నించిన సంగీతను చితకబాదాడు.
తనకు న్యాయం చేయాలని కోరుతూ బోడుప్పల్ లోని శ్రీనగర్ లోని శ్రీనివాస్ ఇంటి వద్ద ఆమె ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. స్థానికులు ఆమెకు మద్దతుగా నిలిచారు. కాగా, శ్రీనివాస్ కు గతంలో వివాహమైందని, ఆమెకు విడాకులు ఇచ్చాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్టు తెలిసింది. ఆ తర్వాత రెండో పెళ్లిగా సంగీతను చేసుకున్నాడని, ఇప్పుడు, మరో అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చాడని పోలీసుల దర్యాప్తులో తేలినట్టు తెలుస్తోంది.