భారత్-శ్రీలంక: భారత్-శ్రీలంక మధ్య వచ్చే నెలలో జరగనున్న వన్డే సిరీస్.. తొలి రెండు వన్డేల్లో మార్పు!
- వచ్చే నెల 10 నుంచి మూడు వన్డేల సిరీస్
- తొలి వన్డే ధర్మశాలలో.. 13న మొహాలీలో రెండో వన్డే
- చలి వాతావరణం కారణంగా మ్యాచ్ ల సమయాల్లో మార్పులు
- బీసీసీఐ ప్రకటన
వచ్చే నెల 10 నుంచి భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ మనదేశంలో జరగనుంది. ధర్మశాల, మొహాలీ వేదికగా ఈ రెండు దేశాల మధ్య జరిగే తొలి రెండు వన్డే మ్యాచ్ ల సమయాన్ని మార్చినట్టు బీసీసీఐ వెల్లడించింది. తొలి రెండు వన్డేలూ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, ఉదయం 11.30 గంటలకు ప్రారంభమవుతాయని బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి ఓ ప్రకటనలో తెలిపారు.
చలి వాతావరణ పరిస్థితుల కారణంగా ఆయా వన్డేల సమయాన్ని మార్చినట్టు తెలిపింది. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ పీసీఏ), పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ)లతో బీసీసీఐ సంప్రదింపులు జరిపింది. ఇరు దేశాల మధ్య తొలి వన్డే డిసెంబర్ 10న ధర్మశాలలో, డిసెంబర్ 13న మొహాలీలో రెండో వన్డే జరగనున్నాయి. విశాఖపట్టణం వేదికగా మూడో వన్డే జరుగుతుంది.