హీరో సిద్దార్థ: ఏ ఇంటర్వ్యూలో అయినా నా వయసు ఎంతో చెప్పేస్తాను.. దాచుకోను!: హీరో సిద్ధార్థ్
- మణిరత్నంకు ‘హర్రర్’ నచ్చదు
- కంగ్రాట్స్ చెప్పారు కానీ, ఈ సినిమా చూడనన్నారు
- ఆయనకు ‘హర్రర్’ అంటే భయమట!
ఏ ఇంటర్వ్యూలో అయినా ముందు తన వయసు ఎంతో చెప్పేస్తానని, దాచుకోనని హీరో సిద్దార్థ అన్నాడు. లాంగ్ గ్యాప్ తర్వాత ఓ హర్రర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నేను, మిలింద్ రావు దర్శకుడు మణిరత్నం గారి శిష్యులం. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. మణిరత్నం గారికి ‘హర్రర్’ అంటే నచ్చదు. ఆయనకు నచ్చని ‘హర్రర్’ విభాగంలో నేను, మిలింద్ కలిసి పని చేశాం.
మణిరత్నం గారి దగ్గర నుంచి ఓ మెస్సేజ్ వచ్చింది. ‘కంగ్రాట్స్. నేను ఈ సినిమా చూడను’ అని ఆ మెస్సేజ్ లో పేర్కొన్నారు. హర్రర్ అంటే మణిరత్నంగారికి భయమట. ఎవరో మమ్మల్ని అడిగారు.. ‘మీరు మణిరత్నం గారి శిష్యులు కదా! ఆయనకు హర్రర్ సినిమాలంటే నచ్చవు. మరి, మీ ఇద్దరేమో, హర్రర్ సినిమా తీశారు ఎందుకు?’ అని ప్రశ్నించారు.
‘మణిరత్నంగారికి హర్రర్ నచ్చదు కాబట్టి, ఈ సినిమా చూడరు. ఈ సినిమా ఆయన కనుక చూస్తే వెయ్యి కరెక్షన్స్ ఇస్తారు! ఆ తర్వాత, ఆయన సినిమా తీస్తున్నారో, మేము సినిమా తీస్తున్నామో అర్థం కాదు’ అని సిద్ధార్థ్ నవ్వుతూ చెప్పాడు. కాగా, ‘ది హౌస్ నెక్ట్స్ డోర్’ త్రిభాషా చిత్రం ఇటీవల విడుదలైంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో హర్రర్ అండ్ థ్రిల్లర్ గా దీనిని తెరకెక్కించారు. తెలుగులో ‘గృహం’ చిత్రంగా విడుదలైంది.